Tuesday, November 26, 2024

మీసం తిప్పిన విశాఖ రొయ్య ! దేశంలోనే అత్యధికంగా ఎగుమతి..

అమరావతి, ఆంధ్రప్రభ : ఈ ఏడాది రొయ్యల ఎగుమతిలో దేశంలోనే విశాఖ అగ్రస్థానంలో నిలిచింది. ప్రాసెస్‌ చేసిన రొయ్యల ఎగుమతిలో ఎప్పుడూ రాష్ట్రంలో అగ్రగామిగా నిలచే విశాఖ ఈ సారి దేశంలోనే అగ్రభాగంలో నిలవడం పట్ల ఆక్వారంగ నిపుణులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అమెరికా, చైనాలు భారతీయ సముద్ర ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటు-న్నాయి. అందులోనూ ప్రాసెస్‌ చేసిన రొయ్యలు ప్రధాన ఎగుమతి ఉత్పత్తిగా ఉంటూ వస్తోంది. ప్రాసెస్‌డ్‌ రొయ్యల తరువాతి స్థానంలో ప్రాసెస్‌ చేసిన చేపలు ఉన్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపెడ) నివేదికల ప్రకారం ఈఏడాది విశాఖపట్నం ఓడరేవు ద్వారా దాదాపు 2.45 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర రొయ్యలు ఎగుమతి చేయబడ్డాయి. ఇది దేశం మొత్తం రొయ్యల ఎగుమతిలో (7.28 లక్షల మెట్రిక్‌ టన్నులు) 33 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌ రొయ్యల ఎగుమతి (3 లక్షల ఎంటీ)లో 82 శాతంగా నమోదైంది. వీటి విలువ దాదాపు 2 బిలియన్‌ డాలర్లుగా ఉందని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. దేశం మొత్తం రొయ్యల ఎగుమతి విలువ 5.8 బిలియన్‌ డాలర్లు కాగా, ఏపీలో రొయ్యల ఎగుమతి విలువ 2.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అయితే, ఈసారి కాకినాడ, కృష్ణపట్నంల నుండి రొయ్యల ఎగుమతి అంతగా లేనందున వైజాగ్‌ నుంచి రొయ్యల ఎగుమతి 82 శాతానికి చేరుకుందని ఆక్వారంగంలో వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఇదే అంశాన్ని ఎంపెడా అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. కోవిడ్‌ మహమ్మారి మత్స్య రంగాన్ని అతలాకుతలం చేసిందని, 2020 మొదటి అర్ధ భాగంలో మత్స్య ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమైనట్లు వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ, ఈ రంగం ఇప్పుడిప్పుడే బాగా కోలుకుందన్నారు. ఇదే వృద్ధికొనసాగితే రాబోయే కాలంలో మరింత వృద్ధిని పొందే అవకాశముందని వారు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఏపీలో 102 రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఉండగా, ఇందులో విశాఖపట్నం పరిసర ప్రాంతాలైన విజయనగరంలో 21 ఉన్నాయి. వనామియా వంటి భారతీయ రొయ్యలకు యుఎస్‌ మరియు చైనాలో అధిక డిమాండ్‌ ఉంది. వైజాగ్‌ ఉత్పత్తికి ప్రత్యేక రుచి మరియు డిమాండ్‌ ఉండటంతో విశాఖ, విజయనగరం పరిసరాల్లోని 21 ప్రాసెసింగ్‌ యూనిట్ల నుండి పెద్ద మొత్తంలో ఎగుమతులు జరిగాయని రొయ్యల ఎగుమతిదారు పేర్కొంటున్నారు. మొత్తం రొయ్యల ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 23 శాతం వృద్ధిని నమోదు చేసి 5.9 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకున్నాయని ఎంపెడా అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement