Thursday, November 21, 2024

Visakha – ఆస్తి పంచుకున్నారు .. అనాథలుగా వదిలేశారు

పండుటాకుల కన్నీటి ఘోష
అవసాన దశలో వృద్ధ జంట
ఆస్తి తీసుకొని త‌ల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకోని కొడుకులు
తిండి కోసం, మందుల కోసం తిప్ప‌లు
న్యాయం కోసం వెళ్తే పోలీసుల వేధింపులు
పోలీస్ ఉన్న‌తాధికులు స్పందించాలి..
న్యాయం చేయాల‌ని వేడుకోలు

ఆంధ్రప్రభ స్మార్ట్, గాజువాక (విశాఖజిల్లా) : అనుబంధం .. ఆప్యాయత అంతా ఒక బూటకం అని నిరూపించే కన్నీటి గాథ ఇది. తల్లి పేగు బంధాన్ని పెద్ద కొడుకు తుంచేశాడు. చిటికెన వేలు పట్టి నడకలు నేర్చుకున్న కొడుకు తన తండ్రిని మంచం పాలు చేశాడు. ఆస్తి తీసుకుని అనాథలుగా మార్చే కిరాతకుడిగా మారాడు. ఈ కఠినాత్ముడికి పోలీసులు వకల్తా ఇస్తున్నారు. ఈ పండుటాకుల దయనీయ వైనం ఇలా ఉంది.

ఆస్తి పంచుకున్నాక‌..
విశాఖ జిల్లా గాజువాక పాత కర్ణ వాణి పాలేనికి చెందిన కన్నయ్య, చెల్లాయమ్మ వృద్ధ దంపతులు. అవసాన దశకు చేరుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. అందరి మాదిరిగానే ముగ్గురికీ ఆస్తి సమానంగా పంచారు. ఆ తరువాతే కొడుకుల్లో విశ్వరూపం బయటపడింది. అమ్మానాన్నను రోడ్డు పాలు చేశారు. భర్త కన్నయ్య అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆయనకు మందులు, తినటానికి తిండిలేక పస్తుల పరిస్థితి దాపురించింది. తమను వీధిపాలు చేసినందుకు తాము పంచిన ఆస్తులను తమకే హక్కు కల్పించాలని ఈ దంపతులు న్యాయ పోరాటానికి దిగారు. తమకు వైద్య సాయం, ఆశ్రయం కల్పించిన వారికే తమ ఆస్తిని అప్పగిస్తామని ఆ దంపతులు పట్టుబట్టారు. ఈ స్థితిలో పెద్ద కొడుకు, మనవడు భౌతిక వేధింపులకు దిగారని, తమ దాడి చేసి తమను తీవ్రంగా గాయపర్చారని, తలకు, మెడకు తీవ్ర గాయాలయ్యాయని, ఆ గాయాలతో బాధపడుతున్నామని వృద్ధురాలు చెల్లాయమ్మ రోధించారు.

పోలీసులు కూడా వేధిస్తున్నారు..
ప్రస్తుతం తమ చిన్న కుమారుడి దగ్గర ఆశ్రయం పొందామని, కానీ తాజాగా తమపై పోలీసుల వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ ఇబ్బంది పెడుతున్నారని , మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరుకు స్టేషన్ దగ్గరే ఉంచారని, తప్పు చేసిన వారిని వదిలేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంత వరుకు సమంజసం అని కన్నీరు పెట్టుకున్నారు. ఇంటికి వచ్చి తమ పరిస్థితి చూడాలని కోరినా తమ మాట వినడం లేదని, తక్షణం పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చెయ్యాలని వృద్ధురాలు కన్నీటి పర్యంతం అయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement