Friday, September 20, 2024

Visakha ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరం

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీచేయరాదని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. విశాఖ నేతలతో జరిపిన టెలి కాన్ఫరెన్స్ లో టీడీపి అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించారు.

టీడీపీ కూటమి పక్షాల బలం పరిమితంగా ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్‌ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఇందులో ఓటర్లు. వీరిలో 60 శాతానికిపైగా వైసీపీ నుంచి గెలిచిన వారే.

- Advertisement -

విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 53 మంది కౌన్సిలర్లు, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మరో ముగ్గురు వైసీపీ ఎక్స్ ఆఫీషియో కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉండగా, వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి. బలం లేకుండా పోటీ చేయడం కంటే ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదని భావించిన చంద్రబాబు తన నిర్ణయాన్ని నేతలకు వివరించారు. కాగా, అంతకు ముందు బైరీ దిలీప్ పేరు ను అభ్యర్థిగా బరి లోకి దించాలని విశాఖ నేతలు సూచించారు.

ఇదిలా ఉండగా.. నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది.. ఇప్పటివరకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను బొత్స సత్యనారాయణ పొందు పరిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పు 93లక్షలు, ఆస్తులు 73.14లక్షలు పెరిగినట్టు బొత్స చూపించారు. ఇక బొత్స నామినేషన్‌ సక్రమమని తేలితే ఆయన ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement