Thursday, September 12, 2024

Visakha – స్కూళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం …నారా లోకేష్

విశాఖపట్నం: భీమిలిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. 10వతరగతి క్లాస్ రూమ్ ను సందర్శించి అక్కడ పాఠ్యాంశాల బోధన, సౌకర్యాలపై విద్యార్థినులను ఆరాతీశారు. వెలుపల చెప్పులు వదిలి మంత్రి క్లాస్ రూమ్స్ ను సందర్శించారు. క్లాస్ టీచర్లను గౌరవిస్తూ తమ పక్కనే కూర్చొని వివరాలు చెప్పాలని కోరారు.

పరీక్షలు ఏ లాంగ్వేజిలో సులభతరంగా ఉన్నాయని అడిగారు. తెలుగులో మాట్లాడటం సులభంగా ఉంటుంది, పరీక్షలు ఇంగ్లీషులోనే రాస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్ బ్లాక్ బోర్డు ఉపయోగకరంగా ఉందా అని ఆరా తీశారు. వెనుకబడిన విద్యార్థుల కోసం పాఠశాలలో ఏర్పాటుచేసిన రెమిడియల్ క్లాస్ రూమ్ ను మంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటుచేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను పరిశీలించారు. మీ డ్రీమ్స్ ఏమిటి? జీవితంలో ఎటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారని ప్రశ్నించిన మంత్రి, ఒక లక్ష్యాన్ని ఏర్పాటుచేసుకుంటే సాధించేవరకు వదలకూడదని అన్నారు.

- Advertisement -

ఈ స్కూలు నుంచి ఇద్దరు విద్యార్థినులు ఐఐటిలో సీట్లు సాధించడంపై మంత్రి అభినందించారు. విద్యార్థినులు బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా సర్వశిక్ష అభియాన్ ఎపిసి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఇక్కడకు సమీపంలోని పద్మనాభం కెజిబివి స్కూలులో స్టూడెంట్- టీచర్ మెటీరియల్, స్టోరీ టెల్లర్, మైండ్ గేమ్స్ తయారు చేసి రాష్ట్రవ్యాప్తంగా 352 స్కూళ్లకు పంపుతున్నామని చెప్పారు. ఇప్పటివరకు పాఠ్యాంశాలకు సంబంధించి 2వేల వీడియోలు తయారుచేశామని తెలిపారు. తర్వాత ఇన్నొవేషన్ క్లాస్ రూమ్ ను మంత్రి సందర్శించారు. అక్కడ భారత రక్షణ పరికరాలకు సంబంధించిన చిత్రాలను విద్యార్థినులు ప్రదర్శించారు.

ఆయా పరికరాల విశిష్టత ఏమిటని విద్యార్థినులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. ఇక్కడ మంచి లైబ్రరీ ఏర్పాటు చేశారంటూ సంతృప్తి వ్యక్తంచేశారు. రెడ్డీ ల్యాబ్స్ వారు అందజేసిన కెమికల్స్ ను పరిశీలించారు. అవి ఏమేరకు ఉపయోగకరంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. లోకల్ ఫర్ వోకల్ పేరుతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను లోకేష్ సందర్శించారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడమే తమ లక్ష్యమని విద్యార్థినులు తెలిపారు. కెజిబివిలో బోధనా పద్ధతులు, సౌకర్యాలను ప్రిన్సిపాల్ కుమారి గంగ మంత్రికి వివరించారు. విద్యార్థినులతో కలిసి మంత్రి ఫోటో దిగారు.

మంత్రి దృష్టికి విద్యార్థినుల సమస్యలు

చివరిగా స్కూలు డార్మెటరీని మంత్రి లోకేష్ సందర్శించారు. అక్కడ సౌకర్యాలపై విద్యార్థినులను ఆరాతీశారు. టాయ్ లెట్స్ ను పరిశీలించారు. విద్యార్థినులు సమస్యలు చెబుతూ తమకు ల్యాబ్ కెమికల్స్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాలు కల్పంచాలని కోరారు. ప్లేగ్రౌండ్ చిన్నదిగా ఉందని, పెద్ద ప్లేగ్రౌండ్ సౌకర్యం కల్పించాలన్నారు. స్కూలుకు వచ్చే అప్రోచ్ రోడ్డు సరిగా లేదు, రహదారి సౌకర్యం కల్పించాలి. డార్మెటరీలో బెడ్స్ లేక ఇబ్బంది పడుతున్నాం. హెల్త్ కిట్స్ అందించాలి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఆట్యా-పాట్యాలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు వెళ్తున్నాం. సౌకర్యాలు కల్పిస్తే మరింత ప్రతిభ కనబరుస్తాం. క్రికెట్ లో గుజరాత్ వెళ్లి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నామని విద్యార్థినులు చెప్పగా, మంత్రి లోకేష్ వారిని అభినందించారు. ఇకపై రాష్ట్రంలో ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ మీట్, సైన్స్ ఫేర్ నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థినులకు అవసరమైన క్రీడా పరికరాల కిట్స్ కూడా అందజేస్తామని తెలిపారు. భీమిలి కస్తూరిబా స్కూలులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుచేస్తాం. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

విద్యాకమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలి

ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాల మెరుగుదల, సౌకర్యాల కల్పనలో విద్యా కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని లోకేష్ కోరారు. భీమిలి కెజిబివి స్కూలు విద్యాకమిటీ సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో స్కూళ్లను దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం, విద్యాకమిటీలు ఏర్పాటుచేసింది పెత్తనం చేయడానికి కాదు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత పెంచాలి. అన్ని సమస్యలు ఒకేరోజు పరిష్కారం కావు. పాఠశాలల్లో టాయ్ లెట్స్ నిర్వహణ బాధ్యత మీదేనని చెప్పారు.

ప్రత్యేకమైన యాప్ ద్వారా విద్యాకమిటీల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ను కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఆయా స్కూళ్ల ర్యాంకింగ్స్ ను ఆన్ లైన్ పెడతాం. మన ప్రభుత్వంలో ఏదీ దాపరికం ఉండదు. అన్నీ పారదర్శకంగానే ఉంటాయని అన్నారు. విద్యాకమిటీలు, టీచర్లు, ప్రిన్సిపాల్ సమన్వయంతో పనిచేయాలి. పెండింగ్ లో ఉన్న ఆయాల జీతాలు, కెమికల్ బిల్స్ చెల్లిస్తామని చెప్పారు. విద్యాకమిటీ చైర్మన్ చందవరపు కుమార్ మాట్లాడుతూ… భీమిలి కెజిబివి స్కూలులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుచేయాలి. విద్యార్థినులకు కాస్మొటిక్స్ చార్జీలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి ఇక్కడ స్కూలుకు ప్రహరీగోడ ఏర్పాటుచేయాలని విన్నవించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement