Saturday, November 23, 2024

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రతిపాదన పంపలేదు .. ఏపీ ప్రభుత్వ నిర్లక్యమన్న ఎంపీ జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనను సమర్పించలేదని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదన పంపాలని 2017 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదని పేర్కొంది. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సోమవారం రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.12,345 కోట్లతో 42.55 కిలోమీటర్ల పొడవుతో మెట్రో రైలు నెట్‌వర్క్ కోసం గతంలో ప్రతిపాదనను సమర్పించిందని, అయితే తర్వాత దానిని కొనసాగించలేదని ఆయన వివరించారు. మెట్రో రైల్ పాలసీ 2017 ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీపీపీ ప్రాజెక్ట్‌లకు 20% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని మంత్రి చెప్పారు.

2017 నుంచి దేశం మొత్తం మీద 23 మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం కేంద్ర ప్రభుత్వంతో సహా రూ. 2.51 లక్షల కోట్లని కౌశల్ కిషోర్ వివరించారు. ఈ అంశంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ… విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రస్తుత వైసీపీ, గత టీడీపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక మెగా సిటీ విశాఖపట్నంకు ప్రపంచ స్థాయి పట్టణరవాణా సదుపాయాలు అవసరమని, వరుస రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, పెరుగుతున్న నగర అవసరాల దృష్ట్యా విశాఖపట్నంలో ట్రాఫిక్ నగరవాసులకు ఇబ్బందిగా మారిందని చెప్పారు. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి మెట్రో రైలు నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ జీవీఎల్‌ఎన్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement