ఏపీలో విశాఖను విద్రోహులకు సెంటర్‌గా మార్చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శలు గుప్పించారు. సింహాచలం లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అవినీతి తప్ప, జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదని విరుచుకుపడ్డారు అమిత్‌షా. రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. రైతు ఆత్మహత్య విషయంలో జగన్ సిగ్గుపడాలన్నారు. ప్రధాని మోదీ ఇస్తున్న నిధులను రైతు భరోసా పేరుతో తానే ఇస్తున్నట్టు జగన్ మభ్యపెడుతున్నాడని ఆరోపించారు.
కేంద్ర పథకాలకు జగన్ ఫొటోలు..
కేంద్రం ఇచ్చిన బియ్యానే పేదలకు పంచుతున్నారు కానీ, కేంద్ర పథకాలకు తన ఫొటో వేసుకుంటున్నాడని అమిత్‌షా అన్నారు. విశాఖను విద్రోహ శక్తులకు అడ్డాగా మార్చారని, కేంద్ర ఇచ్చిన నిధులు ఏమయ్యాయో జగన్ చెప్పాలన్నారు. ఏపీలో అధికార పార్టీ నేతలు భూ కబ్జాలు చేస్తున్నారని, మైనింగ్, ఫార్మా స్కామ్‌లు జరుగుతున్నాయన్నారు.
ఏపీలో 20 ఎంపీ సీట్లు ఇవ్వాలి..
తొమ్మిదేండ్లలో ఏపీ కోసం ప్రధాని మోదీ అనేక పనులు చేశారని, ఇప్పటివరకు ఏపీకి కేంద్ర పది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు అమిత్‌షా. ‘‘జగన్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏపీకి రెండు వందే భారత్ రైళ్లను ఇచ్చాం. రూ.450 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నాం. కడప ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలులో కొత్త ఎయిర్‌పోర్టును ప్రారంభించాం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుమతి ఇచ్చాం. కాకినాడ, విశాఖ, తిరుపతి, అమరావతిని స్మార్ట్ సిటీలుగా కేంద్రం అభివృద్ధి చేస్తోంది. అనేక కేంద్ర విద్యాసంస్థలు పెడుతున్నాం. అందుకని 2024లో జరిగే జనరల్ ఎలక్షన్స్‌లో ఏపీ నుంచి 20 సీట్లలో బీజేపీని గెలిపించాలని అమిత్‌షా స్పష్టం చేశారు.