అనంద పురం ఆగస్టు 6( ప్రభన్యూస్ ): స్నేహితులతో సరదాగా గడుపుతామని మండలంలోని గంభీరం రిజర్వాయర్ కు వచ్చిన బీటెక్ విద్యార్థి నీటిలో మునిగి ముత్యువాత పడ్డాడు. గడిచిన మూడు రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు ఇదే ప్రాంతంలో మృతి చెందడం స్థానికంగా తీవ్రంగా కలచి వేసింది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం …మధురవాడ సమీపంలో గల కొమ్మాది గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు గంభీరం రిజర్వాయర్ దగ్గరికి మంగళవారం వచ్చారు.కార్ షెడ్ ప్రాంతానికి చెందిన నీరుకొండ హితేష్ (18) స్నానానికని జలాశయం వద్దకు వెళ్ళగా ఆ ప్రాంతంలో నాచు ఎక్కువగా ఉండడంతో కాలుజారి పడిపోయి నీట మునిగి గల్లంతయ్యాడు . అతని స్నేహితులు వెనువెంటనే విషయాన్ని అతని తల్లిదండ్రులకు పోలీసులకు తెలియజేశారు.
ఈ మేరకు సీఐ టీవీ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఎస్సై సంతోష్ ఇతర సిబ్బంది సంఘటన స్థలానికి స్థలానికి చేరుకొని రెస్క్యూ టీం తో రంగంలోకి దింపి మృతదేహాన్ని గాలించి వెలికి తీశారు. తండ్రి అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు పై ఆనందపురం సిఐ టీవీ తిరుపతి రావు పర్యవేక్షణలో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.