విశాఖపట్నంలో మహిళలపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి గత రాత్రి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగ్రాతులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి స్థానికుల సాయంతో బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న కంచరపాలెం సీఐ చంద్రశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దాడిలో ఉపయోగించినది నిజంగానే యాసిడ్..? ఇతర ద్రావణమా అనే దానిపై పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఘటన స్థానికులలో తీవ్ర కలకలం రేపుతోంది. బాధితులు ఇచ్చిన సమాచారం ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. గాయపడిన మహిళలను చికిత్స కోసం హాస్పటల్ కు తరలించారు. వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.