Friday, November 22, 2024

అతి త‌క్కువ ధ‌ర‌కే ఆక్సిజ‌న్ అంద‌జేస్తాం – విశాఖ స్టీల్ ప్లాంట్…

విశాఖపట్నం, :కరోనా వైరస్‌ రెండోదశ వ్యాప్తికి తోడు ఆక్సిజన్‌ కొరతతో కటకటలాడుతున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ తీపికబురు అందించింది. కేవలం ప్రాణవాయువు అందక వందలాదిమంది కరోనా రోగులు మరణిస్తున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. అత్యవసరమైన మెడికల్‌ ఆక్సిజన్‌ను ఎంత కావాలంటే అంత సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశాకు వెనువెంటనే సరఫరా చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా ప్రతీ రోజు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే తీవ్రత కనిపిస్తోంది. ఈ దశలో కరోనా రోగికి అక్సిజన్‌ అత్యంత అవసరం. చాలామందికి సకాలంలో ఆక్సిజన్‌ అందక గుండె, మెదడు వంటి కీలక అవయవాలు పనిచేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎంత కావాలంటే అంత ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తామంటూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అవసరమైతే స్టీల్‌తోపాటు ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచుతామన్నారు.
టన్ను రూ. 11వేలకే…
గత ఏడాది ఆంధ్రా, తెలంగాణాతో పాటు ఒడిశా. మధ్యప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలకు అవసరమైన మేర ఆక్సిజన్‌ను అందజేసి తన గొప్పతనాన్ని నిరూపించుకుంది. 2020లో కరోనా దేశాన్ని గడగడలాడించగా ఇదే సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఏకంగా 8842 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను పలు ప్రాంతాలకు సరఫరా చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరకే గతంలో ఆక్సిజన్‌ అందించింది. ఇప్పుడు కూడా కరోనా రెండో దశను దృష్టిలో ఉంచుకొని రోగులు డిమాండ్‌కు తగ్గట్లుగా ఆక్సిజన్‌ సరఫరాకు విశాఖ ఉక్కు సిద్ధంగా ఉందని అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఇందు కోసం లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర, ప్రభుత్వ నిబంధనల ప్రకారం టన్నుకు రూ.11వేలు వసూలు చేసే వెసులుబాటు ఉంది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ధరలను మాత్రమే వసూలు చేసి కావాల్సిన ంత ఆక్సిజన్‌ అందజేయాలని అధికారులు నిర్ణయించారు. దేశంలోని ఏ ప్రాంతం నుంచి తమకు విజ్ఞప్తి అందిన వారి డిమాండ్‌కు తగ్గట్లుగా ఆక్సిజన్‌ అందించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ అధికారులు నిర్ణయంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement