విశాఖపట్నం – మాజీ విశాఖ మేయర్ , అనకాపల్లి మాజి లోకసభ ఎంపీ సబ్బం హరి అకాల మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి , నగర వైసీపీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు .
నారా లోకేష్ సంతాపం
సబ్బంహరి లాంటి నేతను కోల్పోవడం దురదృష్టకరమని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. సబ్బంహరి నిస్వార్థ రాజకీయాలతో తమ లాంటి వారికి మార్గదర్శకులుగా నిలిచారని, ఏ విషయంపై అయినా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవారని, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేశారని లోకేష్ గుర్తుచేశారు. సబ్బంహరి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
అచ్చెన్నాయుడు సంతాపం
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి ఆయన మృతిచెందడం బాధాకరమన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంతా ఆశించామని, ఇంతలోనే మరణవార్త వినాల్సి రావడం దురదృష్టకరమన్నారు. విశాఖ మేయర్, ఎంపీగా ఆయన ప్రజలకు విశేషమైన సేవలు అందించారని, సమస్యలపై పోరాడి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే వెలగపూడి సంతాపం…
తెలుగుదేశం పార్టీ నాయకులు సబ్బం హరి మృతి చాలా బాధాకరమన్నారు విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు..టీడీపీ ఒక ప్రశ్నించే గొంతును కోల్పోయిందని అన్నారు.. మాజీ ఎంపీ గా , విశాఖ నగర మేయర్ గా ఆయన చేసిన సేవ మర్చిపోలేనివని పేర్కొన్నారు.. ఆయన మృతికి సంతాపాన్ని , వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు…