Friday, October 18, 2024

Paderu | గిరిజన కాఫీ ఘుమఘుమలు అద్భుతం : కలెక్టర్

పాడేరు : గిరిజన కాఫీ ఘుమఘమలు అద్భుతంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎ.ఎన్.దినేష్ కుమార్ అన్నారు. మండలంలోని గెడ్డం పుట్టు గ్రామంలో ఉన్న మన్య తోరణం రైతు ఉత్పత్తి దారుల కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ను గురువారం సందర్శించారు. కాఫీ పళ్లు సేకరణ, పల్పింగ్, క్యూరింగ్, రోస్టింగ్, గ్రైండింగ్, కాఫీ పొడరు తయారీ, కాఫీ డికాక్షన్ తయారు, కాఫీ కలుపుకునే విధానాన్ని పరిశీలించారు.

అనంతరం కాఫీ కమ్మదనాన్ని రుచి చూసి తయారీ దారులను అభినందించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల కార్యక్రమాలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాఫీ మార్కెటింగ్ విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో గిరిజన కాఫీని విస్తరించడానికి ప్రమోట్ చేయడానికి 50 మంది గిరిజన యువకులకు శిక్షణ అందించాలని అన్నారు. కాఫీ ఉత్పత్తదారులకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేస్తామని అన్నారు. కాఫీ రైతుల ఆర్ధికాభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. గిరిజన రైతులు పూర్తిగా పక్వానికి వచ్చిన కాఫీ పళ్లును మాత్రమే సేకరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాఫీ బోర్డు ఉప సంచాలకులు సమాల రమేష్ మన్యతోరణం రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధి డూరు వెంకట రమణ, తుంపాడ, గెడ్డంపుట్టు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement