సింహం ఆకారంలో ఉన్న సింహగిరి అత్యంత మహిమాన్వితం.
సింహగిరిపై తొలి ఏకాదశి పూజలు
సింహాచలం, జులై 17 : సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ ప్రదక్షణ చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుందని ఆలయ చరిత్ర చెబుతుందని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా బుధవారం శ్రీనుబాబు ఆ సిరిలొలికించే సింహాద్రి నాధుడుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సింహగిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల సర్వ పాపాలు హరించుకుపోయి వారికి సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయన్నది అప్పన్న భక్తుల అపార నమ్మకమన్నారు.
ఈ నేపథ్యంలోనే ఈనెల 20న శనివారం సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం అత్యంత వైభవంగా జరగనుందన్నారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగని తొలిపావంచ వద్ద అప్పన్న పుష్పరథం బయలు దేరుతుందని చెప్పారు. భక్తులంతా కొండ దిగువన తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి కాలినడకన తమ గిరి ప్రదక్షిణ ప్రారంబిస్తారన్నారు. అక్కడ నుంచి పాత అడవివరం ముడసర్లోవ, హనుమంతువాక జంక్షన్, పాత వెంకోజీ పాలెం చేరుకొని అక్కడ సాగర తీరంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారన్నారు. అనంతరం అప్పు ఘర్, ఇసుకతోట, సీతమ్మధార, మాధవధార గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం తొలిపావంచ వద్దకు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి తమ దీక్షలను పూర్తి చేస్తారన్నారు.
అనంతరం సిరిలొలికించే సింహాద్రినాథుడును భక్తులు దర్శించుకోవడం జరుగుతుందన్నారు. ఇక ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఆఖరి విడత చందన సమర్పణ ఈనెల 21న జరగనుండడంతో భారీగా భక్తులు తరలిరానున్నారన్నారు. ఇందుకు సంబంధించి ఆలయ వర్గాలు, జిల్లా అధికార యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లు ఎంతో అభినందనీయమన్నారు. గతంలో వేల సంఖ్యలో వచ్చే భక్తులు నేడు లక్షల్లోకి చేరిందని అందుకు తగ్గట్లుగానే ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని శ్రీనుబాబు ఆకాంక్షించారు.
ఏకాదశికి పోటెత్తిన భక్తులు …
ఇదిలా ఉండగా బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా సింహగిరి భక్తులతో పోటెత్తింది…స్వామి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఒడిస్సా దాసుడు బృందం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సింహాద్రి నాధుడికి వీరు వివిధ రకాల పుష్పములు, పండ్లు సమర్పించారు. సింహాద్రి నాధుడు దర్శనం అనంతరం దాసుడు ఆశీస్సులు గంట్ల శ్రీనుబాబు తీసుకున్నారు. అనంతరం చందనం అరగదీత కార్యక్రమంలో శ్రీనుబాబు పాల్గొన్నారు.. కొంత సేపు శ్రీ గంధం అరగతీశారు.