Friday, November 22, 2024

హిందూ ధ‌ర్మం విశ్వ వ్యాప్తం – కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి

ఆంధ్రప్రభబ్యూరో . విశాఖపట్నం – ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేద్దామని, ఆ దిశగా ఇప్పటికే చాలా వరకు అన్ని అంశాల్లో పురోగతి సాధించా మని కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. డిసెంబర్‌ 24 నుంచి విశాఖ శంకరమఠంలో విజయేంద్ర సరస్వతి విడిది చేసి ఉన్న నేపధ్యంలో ఈనెల 22 నుంచి ఆయన ఇతర జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపధ్యంలోనే ఆదివారం రాత్రి స్వామి ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా మాట్లాడారు. హిందూ ధర్మం సమిష్టి కృషితో మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాల్సి ఉందన్నారు. ఇందు కోసం దేశ వ్యాప్తంగా మరిన్ని వేద పాఠశాలలు, గోశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా అన్ని దేవాలయాలు, దేవస్థానాలు కృషి చేయాల్సి ఉందన్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తిభావం పెంచే విధంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన విధంగా ఆలయాల్లో ప్రతీరోజు పలు కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు మానసిక ప్రశాంతత చేకూరే విధంగా చేయవచ్చునన్నారు. తాను గురు పరంపరగా 70 కంచి పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలోనే అనేక ప్రాంతాల్లో పర్యటించి ఆదిశంకరాచార్యులు విశిష్టతను లోకానికి తెలియజేస్తున్నామన్నారు. శ్రీశైలంలో త్వరలోనే కంచి స్వామి (చంద్రశేఖరస్వామి) విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విజయేంద్ర సరస్వతి వెల్లడించారు. ఆది శంకరాచార్యులు ఎక్కడ తపస్సు చేశారన్నది గుర్తించింది తొలుత చంద్రశేఖర స్వామియే నన్నారు. అప్పట్లో శ్రీశైలం ప్రాంతంలో అనేక రోజులు చంద్రశేఖర స్వామి అక్కడే ఉండి జపం ఆచరించి ఆదిశంకరాచార్యులు తపస్సు చేసింది శ్రీశైలంలోనేనని గుర్తించారన్నారు. ఆ తరువాత పరంపర స్వాములు కూడా అదే ప్రాంతాన్ని (శ్రీశైలంలోనే) నిర్ధారించారన్నారు. అందువల్లే శ్రీశైలంలో చంద్రశేఖర స్వామి విగ్రహం ఏర్పాటుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. త్వరలోనే విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అప్పట్లో ఆంధ్రప్రభ చంద్రశేఖర స్వామి శ్రీశైలం పర్యటన కథనాన్ని ప్రత్యేకంగా ప్రచురించిన విషయాన్ని స్వామి గుర్తు చేశారు. ఇక 1988లో తాను సింహాచలం ఆలయాన్ని సందర్శించడం జరిగిందన్నారు. అయితే అప్పట్లో స్వామి దర్శనం చేసుకొని వెంటనే వెళ్లిపోయామన్నారు. తాజా పర్యటనలో సింహాద్రినాధుడిని దర్శించడం జరిగిందన్నారు. ఆలయంలో ఉన్న శాస నాలు, ఇతర శిల్ప సంపద కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయని తాను వాటిని నిశితంగా పరిశీలించడం జరిగిందన్నారు.\

కంచి పీఠాదిపతులు 1936లోనే సింహాచలం దర్శించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటో కూడా తమ పీఠంలో పదిలంగా ఉందన్నారు. ఈ సారి చందనోత్సవం, అక్షర తృతియ నేపధ్యంలో సింహాచలం దేవస్థానంలో వెయ్యి మందితో నృసింహ కరావలంబ స్తోత్రం నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని తమ పరివారానికి సూచించామన్నారు. అంతేకాకుండా నృసింహ పంచరత్నం, లక్ష్మీ అష్టకం, నిత్యపారాయణ శ్లోకాలు, మైత్రి భజత మంగళ , రామ చంద్రాయ జనక స్తోత్రాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందు కోసం భజన మండళ్లకు చెందిన పలువురికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. లోకకళ్యాణం కోసమే చాతుర్మాస్య దీక్ష నిర్వహించామన్నారు. కాకినాడ గోశాలలో ఈ బృహత్తర కార్యక్రమం పూర్తి చేశామన్నారు. దీక్ష పూర్తి చేసుకున్న అనంతరం అనేక ప్రాంతాల్లో దేవాలయాలు, గ్రామాలు పర్యటిస్తూ విశాఖ చేరుకోవడం జరిగిందన్నారు. తన పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.

23 నుంచి 28 వరకు శ్రీకాకుళం, విజయనగరంలో పర్యటన:-
కంచిపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పర్యటనలో భాగంగా ఈనెల 23 నుంచి 26 వరకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి అక్కడ ఉన్న పురాతనమైన శ్రీకూర్మం, అరసవల్లి (ఆదివారం) సూర్యనారాయణ స్వామి ఆలయాలు సందర్శిస్తామన్నారు. 27 నుంచి 28 వరకు రెండు రోజుల పాటు విజయనగరం జిల్లాలో పర్యటన ఉంటుందని తెలిపారు. మార్చి 1 నుంచి 2 వరకు అనకాపల్లిలో విజయేంద్ర సరస్వతి పర్యటించనున్నారు. 3 నుంచి 7 వరకు కొవ్వూరులో పర్యటించనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా విశాఖ పర్యటన ముగుస్తుండడంతో ఈనెల 21న సాయంత్రం ఆంధ్రాయూనివర్సిటీ కాన్వొకేషన్‌ హాలులో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కృతజ్ఞతా పూర్వకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో శంకరవిజయేంద్ర సరస్వతి స్వామి పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేసి ప్రసంగిస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement