పెందుర్తి, (ప్రభు న్యూస్) : దేశ వ్యాప్తముగా హిందూ ధర్మ ప్రచారానికి విశాఖ శారదా పీఠం నిరంతరాయముగా కృషి చేస్తుందని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూప నందేంద్ర సరస్వతి, స్వాత్మానందెంద్ర సరస్వతి మహాస్వామిలు పేర్కొన్నారు. నాగుల చవితి పర్వదినాన జన్మించిన స్వరూపానందను శుక్రవారం అప్పన్న ధర్మకర్తల మండల సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టులు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పీఠం ప్రాంగణంలో మర్యాద పూర్వకంగా కలుసుకుని ముందస్తు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఘనంగా స్వామిని సత్కరించారు. ఈ సందర్భంగా సింహాద్రినాథుడు జ్ఞాపికను శ్రీను బాబు బహుకరించారు.. అనంతరం హిందూ ధర్మ ప్రచారానికి విశాఖ శారదా పీఠాధిపతులు చేస్తున్న కృషిని శ్రీనుబాబు కొనియాడారు.
ఈ సందర్భముగా స్వాములుతో పలు అంశాలు ప్రస్తావించారు.. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల్లో పర్యటించి హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయనున్నట్లు స్వామీజీలు తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 11 రామాలయాలు నిర్మాణం, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, ఉచిత వేద విద్య, నిరుపేదలకు అన్నదానం ,వస్త్రధారణ వంటి సేవా కార్యక్రమాలు ముమ్మరం చేసామన్నారు, స్వధర్మ వాహిని ట్రస్టు ద్వారా అన్ని ప్రాంతాల్లోను శారదాపీఠం సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు.. సింహాచలం తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అనేక దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.. ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భక్తి భావం పెంచడమే పీఠం లక్ష్యమని, లోకకళ్యాణార్థం నిరంతరం యజ్ఞ యాగాదులు, హోమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సింహాచలం దేవస్థానానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులను స్వామిలు దృష్టికి శ్రీను బాబు తీసుకెళ్లారు.