విశాఖపట్నం – ఎపిలో ఎన్నికల పొత్తులపై క్లారిటీ ఇచ్చింది బిజెపి.. ఇప్పటికే తమకు మిత్ర పక్షంగా కొనసాగుతున్న జనసేనతోనే ఎన్నికలలో పోటీకి దిగుతామని తేల్చిచెప్పింది.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జి వి ఎల్ నరసింహరావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించిన మూడు ఆప్షన్లలో మొదటి దానికే తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.. టిడిపితో కలసి పోటీ చేసే అవకాశాలు లేవని, పవన్ తోనే ముందుకు సాగుతామని అన్నారు.
జనసేన, బిజెపి మధ్య అవగాహనలోపం ఉందని, ఇరుపార్టీల మధ్య సఖ్యత కొరవడిందనే వార్తలపై జివిఎల్ స్పందిస్తూ, పొత్తులో ఉన్నాం కదా అని కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు పాల్గొని కలసి ఫోటోలకు ఫోజులివ్వలేం కదా అంటూ కౌంటర్ ఇచ్చారు.. జనసేన,బిజెపి మద్య విడదీయలేని బంధం ఉందని, అవసరమైన సమయాలలో ఇరు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధొరణిలో ముందుకు సాగుతామని చెప్పారు.. జనసేనాని తమతో పొత్తులో ఉండగా తెలుగుదేశం వైపు వెళతారని భావించడం లేదన్నారు.. తాము మాత్రం టిడిపికి దూరంగానే ఉంటామని తేల్చేశారు.