విశాఖపట్నం, ప్రభన్యూస్: విశాఖపట్నం పోర్టు అధారిటీ గతంలో ఎన్నూడూ లేని విధంగా ఒక్క మే నెలలోనే సరుకు రవాణాలో పలు పాత రికార్డులను తిరగరాస్తు నూతన రికార్డులను నెలకొల్పింది. 90 ఏళ్ల పోర్టు చరిత్రలో వ్యాపార భాగస్వాముల సౌజన్యంతో పోర్టు రికార్డు స్ధాయిలో ఫలితాలను సాధించిందని విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు తెలిపారు.
ఈ మేరకు మే నెలలో విశాఖ పోర్టు సాధించిన ప్రగతి, నూతన రికార్డుల వివరాలను ప్రకటనలో విడుదల చేశారు. 221 నౌకల ద్వారా మే నెలలో 85,81,927 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసి నూతన రికార్డును నెలకొల్పామని తెలిపారు. 48 నౌకల ద్వారా 22,35,891 మెట్రిక్ టన్నుల కోల్, కోక్‌ను పోర్టు దిగుమతి చేసుకుందని, గతంలో జులై 2002లో 21,39,771 మెట్రిక్ టన్నుల కోల్ కోక్ దిగుమతులే అత్యధిక నిర్వహణగా ఉండేదన్నారు.
అదే విధంగా 13 క్రూడ్ ట్యాంకర్ల ద్వారా 14,27,223 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌ను పోర్టు నిర్వహించిందని, కం-టైనర్ సరుకు రవాణాలో 53 నౌకల ద్వారా 70,539 టిఈయుల కంటైనర్లను ఎగుమతి చేసినట్టు పేర్కొన్నారు. మూడు నౌకల ద్వారా 5,04,815 మెట్రిక్ టన్నుల బాక్సైటును దిగుమతి చేసుకున్నామని, ఈ ఏడాది మార్చిలో చేసిన 2,64,630 మెట్రిక్ టన్నుల బాక్సైట్ దిగుమతులే ఇప్పటివరకు ఉండగా, ఒక నెలలో అత్యధిక బాక్సైటు దిగుమతిగా రికార్డులలో ఉందన్నారు.
అలాగే 17 నౌకల ద్వారా 4,37,270 మెట్రిక్ టన్నుల మ్యాంగనీస్ ఓరును రవాణా చేశారని, గత ఏడాది జూలైలో 3,66,752 మెట్రిక్ టన్నుల మాంగనీస్ ఓరు నిర్వహణ అత్యధిక సరుకు రవాణాగా ఉండేదన్నారు. 5 నౌకల ద్వారా 3,08,213 మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్‌ను దిగుమతి చెశారని, 2022 మేనెలలో చేసిన 213,170 మెట్రిక్ టన్నుల లైమ్ స్టోల్ ఇప్పటివరకు రికార్డుగా ఉండేదన్నారు.
పాతరికార్డులను తిరగరాస్తూ విశాఖ పోర్టు ఇంతటి ప్రగతి సాధించడం పట్ల పోర్టు చైర్ పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు. ఈ రికార్డులు సంస్థ నిర్వహణ సామర్థ్యాన్ని తెలియజేస్తుందన్నారు. సముద్ర యాన రంగంలో నూతన రికార్డులను సృష్టించడంలో మరింత శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోర్టు చైర్మన్ అంగముత్తు అన్నారు.