Sunday, November 3, 2024

పార్టీలకు అతీతంగా క‌ల‌సిరండి – జ‌గ‌న్, ప‌వ‌న్ ల‌కు గంటా పిలుపు..

విశాఖ : ప‌్ర‌త్యేక హోదా విష‌యంలో మోస‌పోయిన విధంగా మ‌రోసారి స్టీల్ ప్లాంట్ విష‌యంలో మోస పోకుండా పార్టీలక‌తీతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ‌కు వైసిపి, జ‌న‌సేన‌లు క‌ల‌సి రావాల‌ని విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు పిలుపు ఇచ్చారు. అధికార పక్షంగా ఉన్న జ‌గ‌న్, బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీగా ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లు కార్మికుల చేస్తున్న పోరాటంలో పాలు పంచుకోవాల‌ని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వందశాతం ప్రైవేటీకరిస్తామని లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ చెప్పిన మాటలపై గంటా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని అన్నారు. మొత్తం ప్రైవేటీకరణ చేయనున్నట్లు గతంలోనే నరేంద్ర మోడీ చెప్పారని, ప్రధాన కార్మిక సంఘాలు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చేస్తున్న పోరాటాలను కేంద్రం పట్టించుకోకుండా తాను చేయాల్సింది చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ముగిసిన అధ్యాయంగా తెలిపారు ఇప్పటికైనా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. స్పెషల్‌ స్టేటస్‌ ద్వారా ఎలా మోసపోయామో ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో మళ్లీ మోసపోయే అవకాశం ఉందని, అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాట మీద ఉంటే స్టీల్‌ ప్లాంట్‌ను సాధించవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే ప్రభుత్వం వెనుక వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం అని అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై రాష్ట్రానికి కేంద్రం నుండి సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తున్నామని నిర్మల స్పష్టం చేశారని చెప్పారు. ప్లాంట్‌ను కాపాడేందుకు ఇకనైనా సిఎం జగన్‌ ప్రధానపాత్ర తీసుకోవాలని కోరారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణపై చంద్రబాబు కూడా ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. పవన్‌ కల్యాణ్‌ కూడా స్పందించాలని కోరారు. అలాగే వైసిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.. తిరిగి వారి ఎన్ని‌క‌కు తెలుగుదేశం పోటీ పెట్ట‌ద‌ని చెప్పారు. ఇక బడ్జెట్‌ సమావేశాల్లో కచ్చితంగా తన రాజీనామాను ఆమోదింపజేసుకుంటానన్నారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణపై బిజెపి నేతలు మాయమాటలు ఆపాలని ఎమ్మెల్యే కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement