Friday, November 22, 2024

Violence – ఎపిలో వైసిపి,టిడిపి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు… పుంగనూరులో ఏజెంట్లు కిడ్నాప్

పుంగ‌నూరులో ఏజెంట్ల కిడ్నాప్
అన్న‌మ‌య్య జిల్లాలో ఏజెంట్లు గెంటివేత‌
ప‌ల్నాడులో హాట్ హాట్.. భారీగా పోలీసులు మోహ‌రింపు
హిందూపురంలో కార్ల ధ్వంసం
శ్రీకాకుళంలో ప‌గిలిన త‌ల‌లు
గ‌న్న‌వ‌రంలో టిడిపి,వైసిపి బాహాబాహి

ఆంధ్రప్రదేశ్‌లో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద టిడిపి , వైసిపి నేత‌లు , కార్య‌కర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి.. . ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్‌ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారి పల్లె పోలింగ్‌ కేంద్రంలో వైకాపా నేతలు అరాచకానికి ఒడిగట్టారు. టిడిపి ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో తెదేపా ఏజెంట్లపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది.

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లెలో తెదేపా ఏజెంట్‌ సుభాష్‌పై ఏజెంట్ పై ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుభాష్‌ కన్ను కోల్పోయాడు.

వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో టిడిపి ఏజెంట్‌పై దాడి చేసి పోలింగ్‌ స్టేషన్‌ నుంచి బయటకు లాగేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలంలోని ఓ పోలింగ్‌ కేంద్రానికి కొంద‌రు నాయకులు గుంపులుగా వచ్చారు. వారిని కేంద్రంలోకి అనుమతించడంపై టిడిపి అభ్యంతరం తెలిపింది. దీంతో అక్క‌డ ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది..

- Advertisement -

ముగ్గురు టిడిపి ఏజెంట్ల కిడ్నాప్ – స్పందించిన ఈసి

చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్‌ చేశారంటూ టిడిపి ఈసీకి ఫిర్యాదు చేసింది. వారిని పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.తే దీనిపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ముగ్గురు ఏజెంట్లు కిడ్నాప్ అయినట్లు వచ్చిన ఆరోపణపై జిల్లా ఎన్నికల యంత్రాంగం తో పాటు పోలీసుల యంత్రాంగం వెంటనే స్పందించడం జరిగిందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు కిడ్నాపైన ఏజెంట్లను పోలీసులు పీలేరులో గుర్తించి, వారిని వెంటనే విధులకు హాజరపరచమ‌ని తెలిపారు.

ఇక‌ పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. కర్నూలు జిల్లా హాలహర్వి 74, బాపురం 22 నెంబర్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు పని చేయలేదు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం ముప్పాళ్లలో టిడిపి, వైసిపి నేత‌లు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్‌ కేంద్రం వద్ద పలువురు ఓటర్లపై దాడి చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైకాపా అభ్యర్థి దుద్దికుంట శ్రీధర్‌ రెడ్డి సొంత గ్రామంలో వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. నల్లసింగయ్యపల్లిలోని 147వ పోలింగ్‌ కేంద్రంలోకి ఆ పార్టీ నాయకులు చొరబడి 10 ఓట్లు వేయించుకున్నారని టిడిపిఆరోపిస్తోంది. అనంతపురం జిల్లా.. ఉరవకొండ నియోజకవర్గం వై.రాంపురంలో 178వ బూత్‌లో పోలింగ్‌ నిలిచిపోయింది. వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి పీఏ వీరన్న సూచనలతో పోలింగ్‌ ఆపేసినట్లు టిడిపి ఆరోపిస్తోంది.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం గోకర్ణపల్లెలో ఘర్షణ చోటు చేసుకుంది. వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం పరిశావారి పాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చిన యువకుడితో వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. యువకుడు ఎదురు ప్రశ్నించడంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువకుడి తలకు గాయమైంది. పోలీసులు కలగజేసుకొని వారిని చెదరగొట్టారు.

రాడ్డులు, వేట కొడవళ్లతో..

పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంభంపాడులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు గొడ్డళ్లు, వేటకొడవళ్లు, రాడ్లతో దాడికి యత్నించారు. ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడి తాజా పరిస్థితిని ఐజీ శ్రీకాంత్‌ పర్యవేక్షిస్తున్నారు.

గురజాల నియోజకవర్గంలో రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు టీడీపీ- వైసీపీ కార్యకర్తలు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తమ లాఠీలకు పని చెప్పారు. అయితే సరే ఇరువర్గాల మధ్య కార్యకర్తలు శాంతించలేదు.

కడప జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను చితకబాదారు. పోలింగ్ స్టేషన్‌లో ఉన్న టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసి బయటకు లాగేశారు. అటు అనంతపురం జిల్లా కల్యాణ‌దుర్గంలో ఓ పోలింగ్ కేంద్రానికి గుంపుగా వచ్చారు వైసీపీ నాయకులు. అంతేకాదు వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడంపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తంచేశాయి.

మరోవైపు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం మల్లెవారిపల్లిలో తెదేపా కార్యకర్త జడ రాంప్రసాద్‌ను వైకాపా కార్యకర్తలు చితకబాదారు. చికిత్స నిమిత్తం అతడిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

హిందూపురంలో రెండు కార్లు ధ్వంసం..

హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ నేత, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమ రెడ్డి పై దాడి చేశారు టీడీపీ గూండాలు. వైఎస్సార్ సీపీ నేతల కార్లపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు టీడీపీ నేతలు. ఈ ఘర్షణలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అటు వైఎస్సార్ సీపీ కార్యకర్త నవీన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇక అటు మండికృష్ణాపురం పంచాయతీలో అల్లర్లు జరిగాయి. వైఎస్ఆర్సీపీ బూత్ ఏజెంట్స్ పై కత్తితో దాడి చేసి పరారయ్యారు తెదేపా వర్గీయులు. వైసీపీ బూత్ ఏజంట్ పై కత్తులతో దాడి జరిగింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ వైసీపీ బూత్ ఏజంట్ ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు.

ఆముదాల‌వ‌ల‌స‌లోనూ…

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామంలోని పోలింగ్ రోజున ఇరువర్గాల మధ్య ఘర్షణ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో గాయపడిన ప‌లువురిని చికిత్స కోసం రిమ్స్ కి త‌ర‌లించారు..

కృష్ణా జిల్లాలోనూ..

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే క్యాండిడెట్ యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్ళు విసురుకున్నారు. అటు వల్లభనేని వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు వారి వారి కార్లలో ఉండగా రోడ్డుపై ముస్తాబాద్ ఫ్లై ఓవర్ దగ్గర ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇక, ఇరు వర్గాల కార్యకర్తలకు పోలీసులు సర్ది చెప్పి వెనక్కి పంపించారు.

అలాగే, అంతకు ముందు గన్నవరంలోని బాపులపాడు జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన- వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారు అంటూ ఫిర్యాదులు రావడంతో పోలింగ్ కేంద్రం దగ్గరకు జనసేన సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు చేరుకున్నారు. వైసీపీ నేత గోసుల శివ భారత్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోని జనసేన ఏజెంట్లను బయటికి పంపిస్తున్నారని చలమలశెట్టి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల మధ్య తీవ్ర వాదోప వాదనలు జరగడంతో పోలీసులు సర్ది చెప్పి.. అక్కడి నుంచి పంపించారు.

ఎస్సై అత్యుత్సాహం

నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గంలోని ప్యాపిలిలో ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఉన్న మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తిపై చేయి చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పోలీసు అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సర్దుకుంది. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ అక్కడికి చేరుకున్నారు. అనవసరంగా చేయిచేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement