Friday, November 22, 2024

AP | మద్యం ఎంఆర్‌పీ ఉల్లంఘిస్తే రూ.5లక్షల జరిమానా : సీఎం చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: ఇటీవల కాలంలో మద్యం, ఇసుక వ్యవహారాల్లో పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి. మరో వైపు ఇసుకపై వస్తున్న ఆరోపణలను కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సచివాలయంలో సోమవారం అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ క్ర‌మంలో ప్రజల జేబులను గుల్ల చేసే వారిని ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు.

- Advertisement -

తొలుత ఎక్సైజ్‌ అధికారులు కొత్త మద్యం పాలసీ అమలును సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం జోక్యం చేసుకుంటూ బెల్టు షాపుల ఏర్పాటుపై ఆరా తీశారు. మద్యం వ్యాపారులు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తే తొలిసారి రూ.5 లక్షల జరిమానా విధించాలన్నారు.

రెండోసారి కూడా ఇందుకు పాల్పడితే లైసెన్స్‌ రద్దుకు ఆదేశాలు ఇచ్చారు. మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు, ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని, వీటి పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో మానిటరింగ్‌ వ్యవస్థను నెలకొలపాలన్నారు. రాష్ట్రంలో బెల్టు షాపులకు అనుమతి లేదని సీఎం స్పష్టం చేశారు.

ఇతర ప్రాంతాల నుంచి సుంకం చెల్లించకుండా వచ్చే మద్యం, అక్రమ మద్యం విషయాల్లో అధికారులు కఠిన వైఖరి అవలంభించాలని పేర్కొన్నారు. మద్యం షాపుల వద్ద రేట్ల పట్టిక ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా తరుచూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ నిల్వలపై దాడులు చేయాలన్నారు.

అక్రమాలకు అధికారులదే బాధ్యత..

ఉచిత ఇసుకలో అక్రమాలు చోటు చేసుకుంటే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక లభ్యత పెంచడంతో పాటు అన్ని రీచ్‌ల నుంచి సులభంగా తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ కూడా తరలి వెళ్లేందుకు వీళ్లేదని స్పష్టం చేశారు. మద్యం, ఇసుక విధానాల్లో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందని సీఎం తెలిపారు. దీనిని క్షేత్రస్థాయి వరకు సక్రమంగా అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement