అనంతపు కీర్తి కిరీటం
అన్ని ఆఫీసులకు సర్టిఫికెట్
అన్ని హంగులు ఏర్పాటు
కోర మీసం కుర్రోడు.. జాకీచాన్ లాంటివాడు. పనిలో కమిట్మెంట్. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వసతుల కల్పన. ఐఎస్ఓ స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేయించడంలో అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ సఫలీకృతులయ్యారు. గుంతకల్లు ఆర్డీవో ఆఫీసు, జిల్లా ఆహుడా కార్యాలయం, మహిళ శిశు సంక్షే మ శాఖ, జిల్లా రవాణా శాఖ అధికారి తదితర కార్యాలయాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ మంజూరైంది. ఐఎస్ఓ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సౌకర్యాలు కల్పించడం వల్ల వీటికి ప్రత్యేక గుర్తింపు లభించింది.
అనంతపురం, ఆగస్టు 8 :(ప్రభ న్యూస్ బ్యూరో) : జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ గుర్తింపు కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాలో ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ ను పొందిన మొదటి ప్రభుత్వ కార్యాలయంగా గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయం గుర్తింపు పొందగా.. తాజాగా జిల్లా ప్రణాళిక కార్యాలయం, ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కార్యాలయం (డీటీసీ), అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాలకు ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ లభించింది. ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ పొందాలంటే 39 రకాల ప్రమాణాలు అవసరమవుతాయి.
అలాంటి 39రకాల ప్రమాణాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మార్గనిర్దేశంలో సీపీఓ అశోక్ కుమార్, డీటీసీ వీర్రాజు, అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం జిల్లా అధికారులు సిద్ధం చేసి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఐఎస్ఓ ప్రతినిధులు వచ్చి అన్నిరకాల ప్రమాణాలు ఉన్నాయని ఆయా జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ ను జారీ చేయడం జరిగింది. ఆయా కార్యాలయాలకు ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ ను గ్లోబల్ మేనేజ్ మెంట్ సర్టిఫికేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ వారు అందజేశారు. ఐఎస్ఓ నిబంధనలకు అనుగుణంగా అన్ని కార్యాలయాలను తీర్చిదిద్దారు. అధికారులు వచ్చి పరిశీలించిన తర్వాత ఐఎస్ఓ సర్టిఫికెట్ మంజూరు చేశారు.