Sunday, November 17, 2024

Vijayayawa – వైసిపిలో పొలిటిక‌ల్ హీట్! బ‌లం లేని చోట బ‌రిలోకి

ఆంధ్రప్రభ స్మార్ట్​, విజయాడ ప్రతినిధి: ఏ నిముషానికి ఏమి జరుగునో? ఎవరూహించెదరూ? ఇది పాత నానుడి. రాజకీయాల్లో ఏ పావు ఎటు కదులుతుందో? ఏ పాచిక ఎవరిని గెలిపిస్తుందో? ఎవరిని ఓడిస్తుందో? ఇవీ నేటి రాజకీయాల్లో ఉత్కంఠ రేపే ప్రశ్నలు. ఏపీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల ఎంపిక, అన్వేషణ అనే ఎత్తుగడ అధికార వైసీపీని ఏ ఒడ్డుకు చేరుస్తుంది? ఆ గట్టున ఉండెదెవరు? ఈ గట్టుకు వచ్చేదెవరు? పాత ఇంట్లో కాపురం వద్దంటే.. పరాయి ఇంట్లో కాపురం చేసేదెవరు? రాజకీయాల్లో అన్నీ అర్థం కాని ప్రశ్నలే. అయ్యా పని తీరు బాగోలేదంటే సిట్టింగులకు కోపం. పోనీ ఈ సారికి గెలిపించండి అంటే క్షేత్రస్థాయిలో తాపం. ఇలాంటి స్థితిలో ఏపీ రాజకీయ చరిత్రలోనే కీలక బెజవాడ రాజకీయాల్లో తాజాగా సిట్టింగుల మార్పిడిపై వైసీపీ వ్యూహం ఎంతమేరకు ఫలిస్తుంది. ఫలించి చరిత్ర సృష్టిస్తుంది. ఇదీ సగటు రాజకీయ పరిశీలకుడి మదిలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

సంబంధం లేని చోట పోటీ అంటే..
విజయవాడ నగరంలో ఇద్దరు సిట్టింగు ఎమ్మెల్యేల సీట్ల గల్లంతు.. ఏకంగా ఏపీ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించనుందా? ఏమో? విజయవాడ నేతలు వేసే ప్రతి అడుగూ.. సొంత పార్టీకి ఇబ్బందే. ప్రస్తుతం మల్లాది విష్ణు , వెల్లంపల్లి శ్రీనివాస్ సీట్ల మార్పిడి వ్యవహారం మరో చరిత్రకు దారి తీస్తోందా? ఈ ఇద్దరిలో ఒకరికి జగన్ టికెట్ ఇవ్వలేదు. మరొకరికి నియోజకవర్గం నుంచి బదిలీ చేశారు. తనకు సంబంధం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని వెలంపల్లిని సెంట్రల్ నియోజకవర్గానికి పంపించే నిర్ణయం తీసుకుంటే… మల్లాదికి ఎమ్మెల్సీ బిస్కెట్‌ వేశారని ప్రచారం జరుగుతోంది. కానీ, తాను నిర్మించుకున్న రాజకీయ పునాదిని ధ్వంసం చేయటం ఎంతవరకూ సబబు అని అటు మల్లాది, ఇటు వెల్లంపల్లి గుక్కపెడుతున్నారంటే అతిశయోక్తి కాదు.

కాంగ్రెస్ రేవులో మల్లాది

అధికార పార్టీ పొగ పెట్టి సాగనంపుతున్న తరుణంలో… పార్టీకి రాజీనామా చేసి… కాంగ్రెస్ పార్టీలో చేరాలని చాలా మంది సిట్టింగులు పెట్టేబేడా సర్దుకుని కాంగ్రెస్ పిలుపు కోసం ఓడరేవులో నిరీక్షిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ తనయ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే సమాచారంతో గత పది రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఎనలేని మార్పులు కనిపిస్తున్నాయి. పార్టీ తిరస్కరిస్తే…ప్రత్యామ్నాయ ఒడ్డు కోసం వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పటికే అన్వేషణ పారంభించారంటే ఊహాజనితం కాదు. ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని ప్రకటించారు. అదే బాటలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మల్లాది విష్ణుకు ఈసారి టికెట్ లేదని ..ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వడంతో మల్లాది వైసీపీకి గుడ్ బై చెబుతున్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది.

వెల్లంప‌ల్లికి బాధ్య‌త‌లు..

- Advertisement -

తనను కాదని తన నియోజకవర్గానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కి బాధ్యతలు అప్పగించడాన్ని మల్లాది విష్ణు అవమానంగా భావిస్తు్న్నారు.ఇక మల్లాది విష్ణు వర్గీయులైతే.. మరింత ఆగ్రహంగా ఉన్నారు. ఏ పార్టీ అయితేనేం.. మన బలంతో మనం గెలుస్తాం. అసలు మనది కాంగ్రెస్ పార్టీ. మన అమ్మ పార్టీ మనదే. కాంగ్రెస్లో చేరుదాం, అని నియోజకవర్గంలో క్షేత్రస్థాయి కార్యకర్తలే మల్లాది విష్ణుపై ఒత్తిడి చేశారని తెలిసింది. తనకు టికెట్ ఇవ్వని పార్టీలో ఉండటం కంటే పార్టీని వీడటమే మంచిదనే ఆలోచనకు మల్లాది విష్ణు చేరుకున్నారని తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ లో షర్మిల రాకతో చేరికలు జోరందుకోవడంతో మల్లాది విష్ణు కూడా అదే పార్టీలో చేరాలని భావిస్తున్నారని సమాచారం.తన అనుచరులు, కార్పొరేటర్లతో బుధవారం మల్లాది విష్ణు పలు దఫాలుగా భేటీ అయ్యారు.వాళ్లతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మల్లాది విష్ణు చెప్పినట్లుగా ఆయన వర్గం స్పష్టంగా చెబుతోంది.వైసీపీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరికకు సన్నాహాలు కూడా చేస్తున్నట్టు సమాచారం.

అక్క‌డ ఇంట్ర‌స్ట్ లేదు..

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కాదని ..అక్కడి ఎమ్మెల్యే , మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు వెలంపల్లి విముఖత వ్యక్తం చేశారు.తనకు బలం, బలగం ఉన్నచోటు వదులుకొని సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే మల్లాది విష్ణు వర్గం తనను తప్పక ఓడిస్తుందని శ్రీనివాస్ పసిగట్టారు. పోటీకి తనకు ఇష్టం లేదనే సంకేతాల్ని కూడా అధినేత జగన్ దృష్టికి పంపినట్లుగా తెలుస్తోంది. 2014లో వెలంపల్లి శ్రీనివాస్ బీజేపీలో చేరి పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ గెలవలేదు. 2019లో వైసీపీ టిక్కెట్టుపై గెలిచి మంత్రి బాధ్యతలూ నిర్వహించారు. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా గెలిచారు. అప్పటి నుంచి పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లి శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో పునాది వేసుకున్నారు. ఈ స్థితిలో నియోజకవర్గ మార్పిడినీ జీర్ణించుకోలేక పోతున్నారు. బీజేపీ లేదా కాంగ్రెస్ టిక్కెట్ తో బరి దిగాలని భావిస్తున్నారని ద్వితీయ శ్రేణి సమాచారం. ఏతావాతా విజయవాడ పశ్చిమలో చోటు చేసుకున్న పరిణామాలు అటు టీడీపీకి ఇటు కాంగ్రెస్ కి లాభం చేస్తాయా? లేక వైసీపీ వ్యూహమే ఫలిస్తుందా? ఒకటి నిజం ఇద్దరు నాయకులూ పోటీ చేయకుండా ఉండలేరు. అదే ప్రస్తుతం బెజవాడ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement