2024లో జరుగుబోయే ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవు తున్నాయి. దీంట్లో భాగంగా పలు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక..ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఎన్నికలకు 18 నెలల సమయం ఉండగా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందస్తు వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కొద్దిమందికి టికెట్ల విషయంలో అభయం ఇచ్చినట్టు సమాచారం. అందులో భాగంగా సినీనటుడు అక్కినేని నాగార్జునను ఏపీ రాజధాని విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైసీపీ ఎంపీగా పోటీలో దింపేందుకు ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
2014, 2019 లో వైసీపీ అభ్యర్థులుగా పారిశ్రామిక వేత్తలు కోనేరు రాజేంద్రప్రసాద్. పొట్లూరి వరప్రసాద్ విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. రాబోయే జనరల్ ఎలక్షన్స్‌లో అయినా ఎంపీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని అందుకు ఇప్పటినుంచే వైసీపీ నేతల అన్వేషణలో పడ్డారు. ఈ మేరకు నాగార్జున పేరును కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.