ఏపీలో హాల్ చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ సభ్యుల్లో కొందరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా చెడ్డీ గ్యాంగ్ విజయవాడ, అమరావతి, తాడేపల్లి ప్రాంతాల్లో పలు చోట్ల చోరీలకు పాల్పడింది. విజయవాడ, గుంటూరులో యథేచ్ఛగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… రెండు గ్యాంగ్ లకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
చెడ్డీ గ్యాంగ్ తాడేపల్లి చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులను గుజరాత్ పోలీసులు గుర్తించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి రెండు చెడ్డీ గ్యాంగ్‌లకు సంబంధించిన నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా ఈ నెల 7న విజయవాడ సమీపంలోని పోరంకి, వసంత్‌నగర్‌లో చోరీలకు పాల్పడింది. ఆ తర్వాత ముఠా కదలికలు ఆగిపోయాయి. నిఘా పెరగడంతో ముఠా గుజరాత్ వెళ్లిపోయారు. దీంతో పోలీసులు రెండు బృందాలను గుజరాత్ కు వెళ్లాయి. చెడ్డీగ్యాంగ్ సభ్యులు ఉపయోగించిన ఫోన్ల ఆధారంగా వీరి ఆచూకీని కనిపెట్టారు. ఈ క్రమంలో గ్యాంగ్ సభ్యుల్లో నలుగురిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం.