Wednesday, November 6, 2024

Vijayawada – మీ సమస్యను పరిష్కరిస్తా – 56వ డివిజ‌న్ నివాసితులకు ఎంపీ చిన్ని భరోసా

( ఆంధ్రప్రభ కేదారేశ్వరపేట )ప్రజల సమస్యకు పరిష్కారం చూపించేందుకే ప్ర‌జాప్ర‌తినిధులుగా త‌మ‌ని గెలిపించార‌ని…ప్ర‌జ‌ల ఇబ్బందులు తొల‌గించేందుకే రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని 56 డివిజ‌న్ పాత రాజ‌రాజేశ్వ‌రి పేట లోని నివాసితుల‌తో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాత రాజరాజేశ్వరి పేటలోని 56వ డివిజన్ లో ఇల్లు కూల్చివేసేందుకు సిద్ధమైన రైల్వే శాఖ ఇటీవ‌ల నివాసితులు ఖాళీ చేసి వెళ్లిపోవాల‌ని డ‌ప్పు కొట్టి చాటింపు వేసింది.

దీంతో 50 ఏళ్లుగా అక్క‌డ వుంటున్న నివాసితులు రైల్వే శాఖ త‌మ ఇళ్ల తొల‌గింపు కార్య‌క్ర‌మం ఉప‌సంహ‌రించుకోవాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారం తో స్థలాలకి పట్టాలు మంజూరు చేయ్యాలని డిమాండ్ చేస్తూ నివాసితులు ధర్నా చేప‌ట్టారు. ఈ ధ‌ర్నా శిబిరానికి బుధ‌వారం కేశినేని విచ్చేసి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.

వారితో మాట్లాడి అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని…ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి ఈ స‌మ‌స్య‌ను తీసుకువెళ్లి శాశ్వ‌తంగా ప‌రిష్క‌రిస్తామ‌న్నారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ఎంపి మీడియా తో మాట్లాడుతూ పాత రాజరాజేశ్వరి పేటలోని 56వ డివిజన్ లో గత 50 ఏళ్ళ నుండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని సుమారు 2000 వేల కుటుంబాలు, 800 ఇళ్ళు ఉంటున్నాయ‌న్నారు. 2002 లో ఈ ప్రాంతంలో ఇలాంటి సమస్య వచ్చింది.. అప్ప‌ట్లో టీడీపీ ఎంపీ గా ఉన్న గద్దె రాంమోహన్, నాగుల్ మీరా ఆ సమస్యకు పరిష్కారం చూపడం జరిగిందన్నారు. ఈ సమస్య గురించి రైల్వే ఉన్నత అధికారులతో, విజవాడ మున్సిపల్ అధికారుల‌తో మాట్లాడి ముందు తాత్క‌లిక ప‌రిష్కారం చూపిస్తాన‌ని హామీ ఇచ్చారు.

తాత్కాలిక పరిష్కారం చూపిన తర్వాత ఈ సమస్య ను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకువెళ్లి శాశ్వ‌త ప‌రిష్కారం కోసం కృషి చేస్తామ‌ని బాధితుల‌కి ధైర్యం చెప్పారు. రెండు మూడు రోజులలో ఈ సమస్యపై తాత్కాలిక పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తానని బాధితుల‌కి చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్య‌క్షుడు డూండీ రాకేష్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, 56 వ డివిజన్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు , టిడిపి సీనియర్ నాయకులు సందక సురేష్, క్లస్టర్ ఇంచార్జ్ దనేకుల సుబ్బారావు , డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ , టిడిపి నాయకులు శ్యాంప్రసాద్, మహిళా నాయకులు భవాని, లక్కు శాంతిల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement