Tuesday, November 26, 2024

Vijayawada – రణ‌రంగంగా అంగనవాడీల నిర‌స‌న … పోలీసు వలయాన్ని ఛేదించుకుని భారీ ప్రదర్శన…

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో – రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్షా పదివేల మంది ఉన్న అంగనవాడి వర్కర్లు హెల్పర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, వివిధ రకాల యాప్ ల పేరుతో పెంచిన పని భారాన్ని తగ్గించాలని, మినీ అంగన్వాడి వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని,నాణ్యమైన, సరైన కొలతలతో కూడిన సరుకులు సరఫరా చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారానికై సోమవారం విజయవాడలో మహాధర్మాకు ఐ.ఎఫ్.టి.యు. అనుబంధ ఏపీ ప్రగతిశీల అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏఐటియుసి అనుబంధ ఏపీ అంగన్వాడి వర్కర్స్& హెల్పర్స్ అసోసియేషన్, సిఐటియు అనుబంధ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ రణరంగంగా మారింది. మూడు సంఘాలు ఐక్యంగా ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది అంగనవాడి వర్కర్స్, హెల్పర్లు విజయవాడకు తరలివచ్చారు. వివిధ ప్రాంతాలలో జిల్లాలలోనే చాలామందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నిర్భందించారు. కొంతమందిని గృహ నిర్బంధంలో వుంచారు. అయినప్పటికీ వేలాది మంది పోలీసులు నిర్బంధాన్ని ఛేదించుకుని విజయవాడకు చేరారు.

విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించాలని మూడు సంఘాలు తలపెట్టారు. దానికి పోలీసులు, ప్రభుత్వం, అనుమతించలేదు. నిషేధాజ్ఞలు విధించారు.అయినా నిషేధాజ్ఞలు ధిక్కరించి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు చేరుకోవాలని నిర్ణయించాయి. మూడు సంఘాల నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయము రోడ్డులోకి చేరుకుని బ్యానర్లు,పెష్టూన్స్ చేతబట్టి వందాలది మంది అంగన్వాడీలు, నాయకులు దూసుకొచ్చారు. అనుకోని పరిణామంతో పోలీసులు అవాక్కయ్యారు. వారు అప్రమత్తమై అంగనవాడిలను అడ్డుకునే లోపే చాలా దూరం దూసుకొచ్చారుసౌత్ ఇండియా షాపింగ్ మాల్ సెంటర్లో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు, రోప్ పార్టీలతో సహా అంగన్వాడీలను అడ్డుకున్నారు. అక్కడ రణరంగంగా మారింది.
అంగన్వాడీల నినాదాలతో రోడ్డు దద్దరిల్లింది. పోలీసులు వారిని ముందుకు జరగనివ్వకుండా అడ్డుకున్నారు.అయినా మొక్కవోని ధైర్యంతో అంగనవాడిలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు దూసుకు పోతున్న వారందరినీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు అరెస్టు చేసిన వారిని వాహనాలలో వేరు వేరు కళ్యాణ మండపాలకు తరలించారు.

ఆ సందర్భంగా మహిళలని కూడా చూడకుండా చీరలు, చున్నీలు లాగేస్తూ, కిందపడేసి ఈడ్చారు. ఆ సందర్భంగా అనేకమందికి గాయాలయ్యాయి.మహిళలను మహిళా పోలీసులు మాత్రమే కాకుండా పురుషులు కూడా చేయి వేసి నెట్టివేస్తూ దుర్మార్గంగా వ్యవహరించారనీ అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా అనేకమంది అంగన్వాడీలను, నాయకులను కూడా అరెస్టు చేశారు .

అంతకుముందే ఐ.ఎఫ్.టి.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు తదితరులను అదుపులోకి తీసుకున్నారు. ధర్నా సందర్భంగా వామపక్ష అనుబంధ సంస్థల యూనియన్ నాయకులు అంగనవాడి సంఘాలు అనుబంధ సంఘాల నాయకులు సభ్యులు అంగన్వాడీ కార్యకర్తలను తదితరులను అరెస్టు చేశారు.
ఈ అక్రమ నిర్బంధాన్ని మూడు సంఘాల రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గాయపడిన ఇఫ్టూ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ నాయకురాలు గంగాదేవిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement