Saturday, November 16, 2024

Vijayawada – డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహారం పంపిణీ

విజయవాడ – విజయవాడ వద్ద వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో, అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగులు పెడుతున్నారు.  కాగా, బుడమేరు ఉప్పొంగి సింగ్ నగర్, ఇతర ప్రాంతాలు వరదముంపుకు గురయ్యాయి. ఇప్పటికీ అక్కడ వరదనీరు నిలిచి ఉంది. సీఎం చంద్రబాబు ఇక్కడ బోటుపై తిరిగి బాధితులను పరామర్శించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, వరద బాధితులకు ఆహారం సరఫరా చేయడం సవాలుగా మారింది. దాంతో డ్రోన్లను రంగంలోకి దించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.   

డ్రోన్ల ద్వారా ఫుడ్ బాస్కెట్లు తీసుకెళ్లే విధానాన్ని ఆయన పరిశీలించారు. డ్రోన్ల సాయంతో ఆహార సరఫరా అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.  లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించవచ్చని, ఒక డ్రోన్ సాయంతో 10 కిలోల వరకు ఆహారం, ఔషధాలు, తాగునీరు పంపవచ్చని అధికారులు తెలిపారు. వాహనాలు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో సహాయ చర్యలు చేపట్టడం సులువు అని వారు పేర్కొన్నారు.  దీనిపై చంద్రబాబు స్పందిస్తూ… వీలైనన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. చంద్రబాబు నుంచి అనుమతి రావడంతో, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించడానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement