Saturday, November 23, 2024

Delhi: ప్రధానితో విజయసాయి భేటీ.. ఆంధ్రప్రదేశ్‌కు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహాకారాలు అవసరమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రధాని కార్యాలయంలో విజయసాయి నరేంద్ర మోదీని కలిసి వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కానుకగా అందజేశారు. విజయవంతమైన నీతి ఆయోగ్ సమావేశంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్టు విజయసాయి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని తెలిపారు. జోన్‌ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రాజ్యసభలో సోమవారం కేంద్రీయ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఆడిగిన ప్రశ్నకు బదులిస్తూ రైల్వో జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. అంతకు ముందు బిల్లుపై విజయసాయి మాట్లాడుతూ రైల్వేకు సంబంధించి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై రైల్వే మంత్రికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద మూడు సంవత్సరాలుగా డీపీఆర్‌ పెండింగ్‌లోనే ఉందని ఆయన పేర్కొన్నారు.

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. 68 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. ప్రతి రోజు 21వేల ట్రైన్లు నడుస్తున్నాయి. దేశంలో 7350 రైల్వే స్టేషన్ల నుండి ప్రతిరోజు 2.2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని విజయసాయి తెలిపారు. రోజుకు 30 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని వివరించారు.

ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి
విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని విజయసాయి మంత్రిని కోరారు. దేశంలో మొత్తం 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లేకపోవడంతో ఉద్యోగార్ధులు రైల్వే పరీక్షల కోసం పక్క రాష్ట్రంలో సికింద్రాబాద్ కు వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంటుకు తగినన్ని వ్యాగన్లు కేటాయించాలి
వైజాగ్ స్టీల్ ప్లాంటుకు డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాగన్లు అందుబాటులో లేకపోవడంతో బొగ్గు సరఫరాలో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. తద్వారా ఉత్పత్తి కుంటుపడుతోందని విజయసాయి రెడ్డి అన్నారు. వ్యాగన్ల కొరత కారణంగా మహానది కోల్ ఫీల్డ్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు తగినంతగా బొగ్గు సరఫరా చేయలేక పోతున్నారు. ఫలితంగా స్టీల్ ప్లాంటులో ఒక బ్లాస్ట్‌ ఫర్నేస్‌ మూసివేయాల్సి వచ్చింది. దీనివలన ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు. సాలీనా 28 వేల కోట్ల టర్నోవర్‌తో విజయవంతంగా నడుస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలనుకోవడం సరికాదని ఆయన అన్నారు. లాభాల బాటలోనున్న సంస్థలు ప్రైవేటు పరం చేయకూడదన్నది బీజేపీ ప్రభుత్వం విధానం అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయాలనుకోవడం శోచనీయని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

రైల్వేలో 2.97 లక్షల ఉద్యోగాల ఖాళీలు
రైల్వేలో 2.97 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీటిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని విజయసాయి కోరారు. 2020-21లో 9529 ఖాళీలు భర్తీ చేయగా 2021-22లో 10637 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారు. ఈ లెక్కన మొత్తం ఖాళీలు భర్తీ చేయడానికి 30 ఏళ్ళు పడుతుంది. 2019లో రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తు రుసుం రూపంలో రైల్వే శాఖకు 864 కోట్ల ఆదాయం చేకూరింది. 2019లో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ నేటి వరకు ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారని రైల్వే మంత్రిని ప్రశ్నించారు. యూపీఎస్సీ మాదిరిగా రైల్వేలో కూడా ఉద్యోగాల భర్తీ నిర్ణీత కాలంలో ప్రతి సంవత్సరం జరగాలని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు.

మహిళల భాగస్వామ్యం పెరగాలి
రవాణా, లాజిస్టిక్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని విజయసాయి రెడ్డి సూచించారు. లాజిస్టిక్ రంగంలో 20శాతం మంది మాత్రమే మహిళా ఉద్యోగులు ఉన్నారని, . కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారిలో మహిళలు కేవలం 1 శాతం మాత్రమే. రవాణా, లాజిస్టిక్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరారు.

సెంట్రల్ యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేయాలి
సెంట్రల్ యూనివర్శిటీల్లో ఏర్పడ్డ ఖాళీలు యుద్ద ప్రాతిపదికన భర్తీ చేయాలని విజయసాయి రెడ్డి సూచించారు. దేశంలో కేంద్ర విద్యా శాఖ పరిధిలో ఉన్న 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 4వ తేదీలోపు ఈ ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర విద్యా శాఖ కోరింది. నిర్దేశించిన సమయంలో ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు.

నియోజకవర్గాల పునర్విభజనలో
జనాభానే ప్రాతిపదిక కాకూడదు

లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం వలన ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ తీవ్రంగా నష్టపోతాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ జనాభాయేతర అంశాలైన ఆ రాష్ట్ర భూభాగము, అడవులు, జీవావరణం, ఆర్థిక అంతరాలు, జనాభా నియంత్రణ వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పునర్విభజన కమీషన్ ఏర్పాటు చేసేందుకు ఎప్పుడు చట్టం చేసినా అందులో పైన తెలిపిన జనాభాయేతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి చేయాలని కోరారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ప్రక్రియను ఆయన ఆహ్వానిస్తూనే, అది చైతన్యవంతమైన భారత ఆధునిక ప్రజాస్వామ్యానికి చిహ్నం అవుతుందని అన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 888 సీట్లతో కొత్త పార్లమెంట్ ఏర్పాటు కాబోతుందన్న విషయం సంతోషించదగ్గదే అయినా నియోజకవర్గాల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుందా అన్న అంశం ఆందోళన కలిగిస్తుందన్నారు.

ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన 2001 జనాభా లెక్కల ఆధారంగా జరిగినప్పటికీ, దేశంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య మాత్రం మారలేదు. 1971 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఉత్తరప్రదేశ్ జనాభాలో 49.2శాతం మాత్రమే. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్ జనాభాతో పోల్చుకుంటే ఏపీ జనాభా 6.8శాతం తగ్గి 42.4శాతానికి చేరింది. కొన్ని అంచనాల ప్రకారం ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా ఉత్తరప్రదేశ్ జనాభాలో కేవలం 39.6% మాత్రమేనని ఆయన తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే జరిగితే ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 50% పెరిగి 120కి చేరుకుంటుంది. అదే సయమంలో ఆంధ్రప్రదేశ్ కేవలం 20శాతం పెంపుతో 30 సీట్లకు పరిమితమవుతుందని అన్నారు. కాబట్టి డీలిమిటేషన్‌ కమిషన్‌ కోసం ఎప్పుడు చట్టం చేసినా జనాభాయేతర అంశాలను కూడా ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన జరిగేలా చూడాలని తద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఈ ప్రక్రియలో అన్యాయం జరగకుండా నివారించవచ్చని విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement