శ్రీకాకుళం, : జిల్లాలో వేస్తున్న కోవిడ్ వేక్సినేషన్ టీకాతో ఎటువంటి భయాందోళనలు అవసరం లేదని, టీకాతో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ స్పష్టం చేసారు. శ్రీకాకుళం బర్మాకాలనీలో గల పట్టణ ఆరోగ్య కేంద్రంలో కోవేక్సిన్ టీకాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శనివారం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తమకి తెలిసిన వారందరికీ కోవిడ్ వేక్సినేషన్ తీసుకోవాలని తెలియజేయడం జరిగిందని చెప్పారు. అయితే వారిలో కొంతమంది భయాందోళనలు వ్యక్తపరచడం జరిగిందని, టీకా వేసుకోవడం వలన ప్రాణహాని జరుగుతుందనే అపోహతో ముందుకురాలేదని తెలిపారు. అది నిజంకాదని, వేక్సినేషన్ తీసుకోవడం వలన ప్రాణభయం, ఎటువంటి కష్టం, నష్టం వాటిల్లదని తేల్చిచెప్పారు. వారిలో ఉన్న అపోహలను, భయాందోళనలను తొలగించేందుకే తాను, తమతో పాటు తమ సిబ్బంది కూడా కోవిడ్ టీకాను తీసుకోవడం జరిగిందని చెప్పారు. భారతదేశంలో కో వేక్సిన్, కోవిషీల్డ్ రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయని, రెండు టీకాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయని తెలిపారు. కొన్ని దేశాల్లో కోవిషీల్డ్ వలన రక్తం గడ్డకడుతుందని టీకాను నిషేదించినట్లు వార్తలు వచ్చాయని, అయితే అందులో వాస్తవం లేదని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. వారిలో ఉండే అంతర్గత రుగ్మతల కారణంగా బ్లడ్ క్లాట్స్ జరిగి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు టీకాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయని తెలియజేసిందని, ఇది శుభపరిణామమని చెప్పారు. టీకా తీసుకున్న అనంతరం 30 నిమిషాల పాటు అబ్జర్వేషనులో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారని, అదేవిధంగా మొదటి డోసు తీసుకున్న 28 రోజులకు రెండవ డోసు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన తెలిపారు. ఆ తరువాత కూడా ఇంక్యుబేషన్ పీరియడ్ 45 రోజుల పాటు ఉంటుందని, ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ లో మాస్కును ధరిస్తూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ, శానిటైజేషన్ చేసుకోవడం ద్వారా చాలా సురక్షితంగా ఉంటామని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి టీకాను అందుబాటులోకి తేవడంపై ప్రజాధనం వృధా అవుతున్నట్లు చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారని, అయితే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకా వలన ఏమాత్రం వృధాకాదనే విషయాన్ని గుర్తెరగాలని స్పష్టం చేసారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకొని సురక్షితంగా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు టి.వెంకటేశ్వరరావు, పి.అన్నపూర్ణ, డా. కె.అప్పారావు, డా.జె.కృష్ణమోహన్, డా. నిర్మలా మల్లేశ్వర్, ఏ.ఎన్.ఎంలు కె.లలిత కుమారి, టి.శేషకుమారి, ఫార్మసిస్ట్ ఎ.సంతోషి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలి – జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ
Advertisement
తాజా వార్తలు
Advertisement