Tuesday, November 19, 2024

ఆర్అండ్ఆర్ కాల‌నీల‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్‌

విజ‌య‌న‌గ‌రం : భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌య నిర్వాసితుల కోసం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఆర్ అండ్ ఆర్‌ కాల‌నీల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి.ఎస్ శుక్ర‌వారం సంద‌ర్శించారు. నిర్వాసితుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. త‌క్ష‌ణ‌మే వాటిని ప‌రిష్క‌రించాల‌ని సంబంధిత‌ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి, జాయింట్ కలెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌ ముందుగా పోలిప‌ల్లి ఆర్ అండ్ ఆర్ కాల‌నీని సంద‌ర్శించారు. కాల‌నీలో ప‌ర్య‌టించి, నిర్వాసితులు, స్థానిక గ్రామ పెద్ద‌ల‌తో మాట్లాడారు. పోలిపల్లి నిర్వాసిత కాల‌నీని పంచాయితీగా ఏర్పాటు చేయాల‌ని, యువ‌త‌కు ఉపాధి క‌ల్పించాల‌ని, పోలిప‌ల్లి జంక్ష‌న్‌ను అభివృద్ది చేసి ఆర్చ్‌ను ఏర్పాటు చేయాల‌ని, అప్రోచ్ రోడ్డుకు కాల‌నీ రోడ్ల‌ను అనుసంధానించాల‌ని గ్రామ పెద్ద‌లు కోరారు. పంచాయితీగా ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. యువ‌త‌కు ఉద్యోగాల‌తోపాటు నైపుణ్య శిక్ష‌ణ ఇచ్చి ఉపాధి క‌ల్పించేందుకు కృషి చేస్తామ‌ని చెప్పారు. అనంత‌రం గూడెపు వ‌ల‌స నిర్వాసిత కాల‌నీలో ప‌ర్య‌టించారు. నిర్మాణంలో ఉన్న అంగ‌న్‌వాడీ కేంద్రం, పాఠ‌శాల భ‌వ‌నాల‌ను ప‌రిశీలించారు. ఈ భ‌వ‌నాల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.

ముఖ్య‌మంత్రి స‌భాస్థ‌లాన్ని ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్‌..
మే 3న భోగాపురం విమానాశ్ర‌యానికి శంకుస్థాప‌న చేసేందుకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి రానున్న నేప‌థ్యంలో, బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించే ప్రాంతాన్ని క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి, జెసి మ‌యూర్ అశోక్ ప‌రిశీలించారు. స‌భా వేదిక‌, హెలీపేడ్‌, పార్కింగ్‌, అప్రోచ్ రోడ్లు, ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌ త‌దిత‌ర అంశాల‌పై వివిధ శాఖ‌ల అధికారుల‌తో చ‌ర్చించారు. బ‌హిరంగ స‌భ‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు, విఐపిల‌కు, అతిధుల‌కు ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా అవ‌స‌ర‌మైన‌ ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జిల్లా పంచాయితీ అధికారి శ్రీ‌ధ‌ర్‌రాజా, ట్రాన్స్‌కో ఎస్ఈ నాగేశ్వ‌ర్రావు, పిఆర్ ఎస్ఈ గుప్త‌, ఆర్ అండ్‌బి ఎస్ఈ జ‌య‌శ్రీ‌, ఇఇ ర‌మ‌ణ‌, తాశిల్దార్ కోరాడ శ్రీ‌నివాస‌రావు, ఎంపిడిఓ బంగార‌య్య‌, ఆయా శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement