Friday, November 22, 2024

ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌కాలంలో అనుమ‌తులు.. క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి

విజ‌య‌న‌గ‌రం, (ప్రభ న్యూస్) : ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌కాలంలో అనుమ‌తులు జారీ చేయాల‌ని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ఆదేశించారు. జిల్లా ప‌రిశ్ర‌మ‌లు, ఎగుమ‌తుల ప్రోత్సాహ‌క మండ‌లి (ది డిస్ట్రిక్ట్ ఇండ‌స్ట్రియ‌ల్ & ఎక్స్‌పోర్ట్ ప్రొమోష‌న్ క‌మిటీ) స‌మావేశం క‌లెక్ట‌రేట్ స‌మావేశ‌మందిరంలో జ‌రిగింది. జిల్లాలో కొత్త‌ ప‌రిశ్ర‌మ‌లు, పారిశ్రామిక వాడ‌ల‌ స్థాప‌న‌కు ఉన్న అవ‌కాశాల‌ను, భూముల కేటాయింపు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ ప‌రిశ్ర‌మ‌ల కోసం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు ఏ శాఖ‌వ‌ద్దా పెండింగ్ ఉండ‌కూడ‌ద‌ని, నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో వాటిని అనుమ‌తించాల‌ని స్ప‌ష్టం చేశారు. పరిశ్ర‌మ‌లు, ఎపిఐఐసి ఆధ్వ‌ర్యంలో పారిశ్రామిక వాడ‌ల స్థాప‌న‌కు పెండింగ్‌లో ఉన్న ప్ర‌తిపాద‌న‌లు కార్య‌రూపం దాల్చ‌డానికి త‌గిన చ‌ర్య‌ల‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని సూచించారు. కొత్త‌వ‌ల‌స మండ‌లం బ‌లిఘ‌ట్టం, రెల్లి, పెద‌రావుప‌ల్లి, కంట‌కాప‌ల్లి గ్రామాల్లో ప్ర‌తిపాదిత భూముల‌ను ప‌రిశీలించి, కేటాయించ‌డానికి క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి, త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆర్‌డిఓను ఆదేశించారు.

అలాగే ఈ భూముల మ్యుటేష‌న్‌పైనా చ‌ర్చించారు. వివిధ పారిశ్రామిక‌ క్ల‌ష్ట‌ర్ల ఏర్పాటుపై చ‌ర్చించారు. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్ష‌న్‌, రైస్‌మిల్ క్ల‌ష్ట‌ర్‌, బెల్లం క్ల‌ష్ట‌ర్‌, మామిడి తాండ్ర క్ల‌ష్ట‌ర్ త‌దిత‌ర ఏర్పాట్ల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు. వీటి ఏర్పాటుకు అధికారికంగా అనుమ‌తులు తీసుకోవాల‌న్నారు..సామాజిక బాధ్య‌తలో భాగంగా వివిధ కంపెనీలు ఖ‌ర్చుచేసే సిఎస్ఆర్ నిధుల‌పై చ‌ర్చించారు. కార్మిక‌శాఖ‌, జిల్లా ప్ర‌ణాళికా శాఖ‌, కాలుష్య నియంత్ర‌ణ సంస్థ‌, ఫ్యాక్ట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ద్వారా ఖ‌ర్చు చేసిన నిధుల‌పై ఆరా తీశారు. ఈ నిధుల‌ను విద్య‌, వైద్య స‌దుపాయాల క‌ల్ప‌న‌కు వెచ్చించాల‌ని సూచించారు. దీనికోసం జాయింట్ క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో ఆయా శాఖ‌లు వెంట‌నే ఒక స‌మావేశాన్ని నిర్వ‌హించి, ప్ర‌తిపాద‌న‌ల‌ను త‌యారు చేయాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా సుమారు రూ.98ల‌క్ష‌ల విలువైన పారిశ్రామిక రాయితీల‌కు అనుమ‌తించారు. చిన్న సూక్ష్మ మ‌ద్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కోసం ఎంఎస్ఎంఈ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిపాదించిన ఫ్లాటెడ్ ఫ్యాక్ట‌రీ కాంప్లెక్స్ ఏర్పాటును ప‌రిశీలించాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో ఆర్‌డిఓ ఎంవి సూర్య‌క‌ళ‌, ట్రైనీ క‌లెక్ట‌ర్ స‌హాదిత్ వెంక‌ట త్రివినాగ్‌, డిఆర్‌డిఏ పిడి ఎ.క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ జిల్లా మేనేజ‌ర్ ఆర్‌.పాపారావు, డిడి నాగేశ్వ‌ర్రావు, వివిధ శాఖ‌ల అధికారులు, పారిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement