విజయనగరం : నేటి తరం యువత, విద్యార్థులు మహనీయుల జీవిత విశేషాలను తెలుసుకోవాలని.. అర్థం చేసుకోవాలని వారు ఆచరించిన, అనుసరించిన మార్గాల్లో పయనించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ ఎ. సూర్యకుమారి అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రఘురాజు, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఆమె బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహనీయుల జీవిత పాఠాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వారి మాదిరిగా సమాజానికి సేవ చేయాలని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహను కలిగి ఉండాలన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ లాంటి మహోన్నతమైన వ్యక్తుల గురించి ప్రసంగాలు కాకుండా ఆయన పాటించిన విధానాలను, పద్దతులను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సామాజిక చైతన్యం కలిగి ముందుకు సాగాలని సూచించారు. చదువు అనే మార్గాన్ని అనుసరించి ఆయన ఎన్నో పోరాటాలు చేశారని, స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటి చెప్పారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని గొప్ప స్థాయికి ఎదగాలని హితవు పలికారు. అరుపులు, కేకలతో ఏమీ సాధించలేమని, అకుంఠిత దీక్ష, ఆత్మ విశ్వాసంతోనే దేన్నైనా సాధించగలమని జయంతి వేడుకలకు హాజరైన విద్యార్థుల్లో కలెక్టర్ సూర్యకుమారి స్ఫూర్తి నింపారు. బాగా చదువుకోవాలని సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించుకోవాలని సూచించారు. పది కాలాల పాటు మనల్ని గుర్తు పెట్టుకొనేలా జీవించాలని ఉపదేశించారు.
చదువే అసలైన ఆయుధం…
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నా.. సామాజిక చైతన్యం తీసుకురావాలన్నా చదువే అసలైన ఆయుధమని విశిష్ట అతిథి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ అణగారిని వర్గాల వారికి ఎన్నో రకాల సేవలందించారని, సమన్యాయం పాటించారని గుర్తు చేశారు. ఆయన బాటలో నడిచి నేటి తరం యువత, సంఘాల నాయకులు సమాజానికి మరింత సేవ చేయాలని హితవు పలికారు. జిల్లా కేంద్రంలో ఎక్కడా కూడా బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం లేదని ప్రభుత్వం వారు స్థలం కేటాయించినట్లయితే ఆ మహనీయుడి విగ్రహాన్ని సంఘ నాయకులతో కలిసి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా రఘు రాజు అన్నారు.