విజయనగరం, నవంబరు 14 : ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా, అత్యంత పకడ్బంధీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. త్వరలో ప్రారంభం కానున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియపై గ్రామ వ్యవసాయ సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సహాయకులకు స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో మంగళవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్ మాట్లాడుతూ… రైతు శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పకడ్బంధీగా రూపొందించిందని తెలిపారు. రైతు ఎంతో కష్టపడి పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరను ఇవ్వడం మన బాధ్యత అని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ, సజావుగా ప్రక్రియను నిర్వహించాలని కోరారు. ఎట్టిపరిస్థితిలోనూ దళారులను, మధ్యవర్తులను దరిచేరనీయవద్దని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియ షెడ్యూలింగ్ నుంచి రసీదు ఇచ్చేవరకు ఐదు దశల్లో జరుగుతుందని, ప్రతీ దశనూ పారదర్శకంగా, పకడ్బంధీగా నిర్వహించాలని సూచించారు. తీసుకున్న ధాన్యానికి ఎఫ్.టి.ఓ తయారైన తరువాత, ఆ ధాన్యంతో రైతుకు సంబంధం ఉండదని, అక్కడినుంచి ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా అధికారి మధుసూదనరావు, సివిల్ సప్లయిస్ డీఎం మీనా కుమారి, వ్యవసాయశాఖ జేడీ వీటీ రామారావు, ఉద్యానశాఖ డీడీ జమదగ్ని, జిల్లా సహకార అధికారి రమేష్, మార్క్‌ఫెడ్ డీఎం విమల, ఇతర అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.