విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన ప్రజా వినతుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలో భాగంగా జిల్లా కలెక్టర్ సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో తొలిసారి స్పందనలో పాల్గొన్న కలెక్టర్ స్పందన కార్యక్రమంలో వినతుల పరిష్కారాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా భావించాలని అధికారులకు స్పష్టంచేశారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. వారి కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని గ్రీవెన్స్‌కు పంపినట్లయితే అనుమతించేది లేదన్నారు. వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన సమావేశానికి వెళ్లాల్సి వస్తే ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. మండల, డివిజన్ స్థాయిల్లో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది వినతులు పరిష్కరిస్తున్న తీరుపై జిల్లా అధికారులు శాంపిల్‌గా కొన్ని వినతులు పరిష్కారం జరిగిన విధానాన్ని తనిఖీ చేయాలని సూచించారు. నిర్ణీత వ్యవధిలోనే వినతులు పరిష్కారం జరగాలని, ఈ విషయంలో జాప్యాన్ని సహించేది లేదన్నారు. సంబంధిత శాఖకు వినతులు వచ్చిన వెంటనే ఆ వినతిని పరిష్కరించే బాధ్యత ఒక అధికారికి అప్పగించాలన్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారి లేదా ఉద్యోగి ఆ పిటిషన్‌పై విచారణకు వెళ్లినపుడు పిటిషనర్‌ను తప్పనిసరిగా విచారణకు పిలిచి అతని అభిప్రాయాన్ని తీసుకోవాలన్నారు. ఆయా పిటిషనర్ ను సంప్రదించకుండా సంబంధిత పిటిషన్‌పై దర్యాప్తును ముగించి పరిష్కరించినట్లు పేర్కొన్నట్లయితే అంగీకరించేది లేదన్నారు. అదేవిధంగా సరైన రీతిలో పిటిషన్‌లపై దర్యాప్తు జరగకుండా ఆయా పిటిషన్లు మళ్లీ విచారణ కోసం ఓపెన్ చేసే పరిస్థితి రాకూడదన్నారు. లోకాయుక్త కేసులు, కోర్టు కేసుల్లో సకాలంలో ఆయా శాఖల నుంచి కౌంటర్‌లు దాఖలు చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులంతా కొనసాగుతారని జిల్లా కలెక్టర్ స్పష్టంచేశారు. వారు ఇంతకు ముందు పనిచేసిన మండలాల్లోనే పర్యటించి కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌లు పద్మలీల, బి.సుదర్శన దొర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement