బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు.. సంక్షమమే లక్ష్యంగా సమసమాజ స్థాపనకు కృషి చేసిన జ్యోతిరావు పూలే గొప్ప సమతావాద దార్శనికుడని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అభివర్ణించారు. లింగ వివక్షతను పారద్రోలి, బాలికలకు చదువు అవసరమని నమ్మి నాటి సమాజంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. ఆయన ఆలోచనలు, అనుసరించిన విధానాలు, అవలంభించిన పద్ధతులు నేటి ఆధునిక సమాజానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. సోమవారం మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి తదితరులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతు సమాజంలో వెనుకబడిన వర్గాలకు జ్యోతిరావు పూలే అండగా నిలిచారని, వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. నాటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ప్రజల్లో చైతన్యం కల్పించి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. పూలే సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి నాలాంటి వ్యక్తికి ఈ రోజు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వటం నిజంగా సంతోషదాయమని అన్నారు. బీసీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా కోలగట్ల పేర్కొన్నారు.