విజయనగరం : గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల మధ్య ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అత్యుత్తమ సమన్వయం వుండాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా పలు శాఖలు కలసి సమన్వయంతో సమిష్టిగా ఒక జట్టుగా పనిచేస్తేనే విజయవంతం అవుతాయని, ఆశించిన ఫలితాలు సాధించగలమన్నారు. అందువల్ల ఆయా శాఖల జిల్లా అధికారులు తమ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేసి కార్యక్రమాలు అమలు చేసేలా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం గురువారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి సమావేశమయ్యారు. జిల్లాలో పరిపాలన పరమైన అంశాల్లో ఏవిధంగా వ్యవహరించాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు సమయపాలన పాటించాలని సమావేశాలకు నిర్దేశించిన సమయానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ స్పష్టంచేశారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎదురయ్యే కోర్టు కేసుల్లో సంబంధిత శాఖల అధికారులు సకాలంలో తగిన విధంగా కౌంటర్లు దాఖలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. చివరి నిముషం వరకు కౌంటర్లు దాఖలు చేయకుండా నిర్లక్ష్యంగా వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇ-ఆఫీసు విధానంలో వచ్చిన ఫైళ్లనే పరిశీలించడం జరుగుతుందని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శ్రీకర్, జిల్లా అటవీ అధికారి ఎస్.వెంకటేష్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement