విజయనగరం, అక్టోబర్ 27(ప్రభ న్యూస్) : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ను కలసి ఎ. పి.ఐ.ఐ.సి, పరిశ్రమల శాఖ, ఆర్.డి.ఓ వెంటనే భూ సంబంధిత అంశాలపై చర్చించుకొని పరిష్కారం చేయాలన్నారు. ముఖ్యంగా కొత్తవలస మండలం రెల్లిలో 158 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ పార్క్, పెదరావు పల్లి గ్రామంలో నున్న 70ఎకరాల డి.పట్టా భూములు, కంటకాపల్లి భూముల అలియనేషణ్ కు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్.డి.ఓ సూర్య కళ కు ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పిఎంఈ జిపి క్రింద ఆయా సంస్థలకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. సింగల్ డెస్క్ పోర్టల్ క్రింద పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులను గడువులోగా పరిస్కారం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. గత సమావేశం నుండి ఈ సమావేశం వరకు నెల రోజుల్లో 81దరఖాస్తులు అందగా 48 దరఖాస్తులకు అనుమతులు ఇవ్వడం జరిగిందని, 29 దరఖాస్తులు వేర్వేరు శాఖల వద్ద పెండింగ్ ఉన్నాయని, 4 దరఖాస్తులను తిరష్కరించడం జరిగిందని డి.ఐ.సి జనరల్ మేనేజర్ పాపారావు తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ… గడువులోగా ఆయా శాఖల వారు పరిష్కరించాలని, తిరష్కరించిన దరఖాస్తులకు సరైన కారణాలను పేర్కొనాలని తెలిపారు. ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఆర్.డి.ఓ సూర్యకళ, జిఎం డి.ఐ.సి పాపారావు, ఎ.పి.ఐ.ఐ.సి జిఎం యతిరాజు, కాలుష్య నియంత్రణ మండలి, ఇన్స్పెక్టర్ అఫ్ ఫాక్టరీస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.