Saturday, November 23, 2024

బీమా పథ‌కాలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ నాగలక్ష్మి

విజయనగరం : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథ‌కాలైన పి.ఎం.జీవన్ జ్యోతి బీమా యోజన, పి.ఎం.సురక్ష బీమా యోజన పధకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకునేలా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ నాగ లక్ష్మి తెలిపారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారంతా ఈ బీమా పథ‌కాలకు అర్హులేనని, జిల్లాలో ఉన్న హై రిస్క్ ప్రజలంతా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం బ్యాంకర్లతో కేంద్ర ప్రభుత్వ బీమా పధకాల నమోదు పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పిఎం జీవన్ జ్యోతి పథ‌కం కింద 18 నుండి 50 సంవత్సరాల వయసు గలిగినవారు సం.నకు 436 రూపాయలను చెల్లిస్తే 2 లక్షల రూపాయలు ఇన్సురెన్సు వస్తుందని తెలిపారు. అదే విధంగా పీఎం సురక్షా బీమా క్రింద 18 నుండి 70 సంవత్సరాల వయసు వారు 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాద బీమా కింద 2 లక్షలు వరకు చెల్లిస్తారని, ప్రమాదంలో అంగవైకల్యం కలిగిన వారికీ కూడా వర్తిస్తుందని పధకం వివరాలను వెల్లడించారు. ఈ పథ‌కాలలో నమోదు చేయడానికి ఈ నెల 1 నుండి జూన్ 30 వరకు ప్రతి గ్రామంలో ప్రత్యేక అవగాహనా సదస్సులు నిర్వహించాలని బ్యాంకర్లకు తెలిపారు. లక్ష్యాలతో సంబంధం లేకుండా జిల్లాలో ఉన్న ఉపాధి కూలీలను, ఆటో డ్రైవర్లను, డ్వాక్రా మహిళలను, కల్లు గీత కార్మికులను, భవన కార్మికులను హై రిస్క్ ఉన్న రంగాల్లో పని చేస్తున్న వారందరిని ఈ పధకం క్రింద నమోదు చేయాలనీ సూచించారు.

పథ‌కంలో చేరడానికి కావలసిన డాక్యుమెంట్ల వివరాలు, ఫోటోలు, అర్హతలు తదితర అంశాల గురించి ముందు రోజే గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా తెలియజేయాలని, మరుసటి రోజు నమోదు చేసుకోవాలని తెలిపారు. మండల స్థాయిలో ముందుగానే ఒక షెడ్యూల్ తాయారు చేసుకోవాలని, సచివాలయాల్లో, బ్యాంకులలో ఈ షెడ్యూల్ ను ప్రదర్శించాలని తెలిపారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి సిబ్బందికి పూర్తిగా అవగాహన కలిగించాలని, తర్వాత గ్రామ స్థాయిలో క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. ప్రతీ వారం ఈ నమోదు వివరాల నివేదికను తనకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమాల్లో బ్యాంకర్లే కాకుండా అధికారులు ప్రత్యెక శ్రద్ధ చూపాలన్నారు. దీనితో పాటు బ్యాంకు అధికారులు జగనన్న తోడు, పంట రుణాల మంజూరు, పరిశ్రమలకు ప్రోత్సహించే రుణాల లక్ష్యాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎల్.డి.ఎం శ్రీనివాస రావు, నాబార్డ్ డిడి నాగార్జున, డి.ఆర్.డి.ఎపిడి కళ్యాణ చక్రవర్తి, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ డా.అశోక్ కుమార్, డి.పి.ఓ శ్రీధర్ రాజు, డి.ఎల్.డి.ఓ నిర్మలా కుమారి, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement