Friday, November 22, 2024

గ్రామీణ యువ‌త‌లో క్రీడా స్ఫూర్తిని నింపండి : క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం : గ్రామీణ యువ‌త‌లో క్రీడా స్ఫూర్తిని నింపాల‌ని, నైపుణ్యాన్ని వెలికితీయాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆదేశించారు. గ్రామ‌, మండ‌ల స్థాయిలో క్రీడా సంఘాల‌ను ఏర్పాటు చేయ‌టం ద్వారా వివిధ క్రీడాంశాల్లో యువ‌త‌కు త‌ర్ఫీదు ఇవ్వాల‌ని సూచించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అనుస‌రించి స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌ను, క్రీడాకారుల‌ను భాగ‌స్వామ్యం చేస్తూ సంఘాలు ఏర్పాటు చేయాల‌ని, స్థానిక స‌చివాల‌య ఉద్యోగికి సంఘం నిర్వ‌హ‌ణ తాలూక బాధ్య‌త‌లను అప్ప‌గించాల‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం త‌న ఛాంబర్ లో జిల్లా స్థాయి అధికారుల‌తో ఆమె ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు.

గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసే క్రీడా సంఘంలో గ్రామ స‌ర్పంచ్‌, కార్య‌ద‌ర్శి, గ్రామం నుంచి జిల్లా స్థాయిలో ఆడిన క్రీడాకారుడు లేదా స్పోర్ట్స్ అథారిటీకి రూ.50వేలు ఆర్థిక సాయం అందించిన‌ వారు మెంబ‌ర్‌గా ఉంటార‌ని, స్థానిక పంచాయతీ ప‌రిధిలోకి వ‌చ్చే పాఠ‌శాల పీఈటీ మెంబ‌ర్ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని పేర్కొన్నారు. మండ‌ల స్థాయి క‌మిటీలో ఎంపీపీ, త‌హ‌శీల్దార్, ఎంపీడీవో, ఇత‌ర అధికారులు, క్రీడాకారులు మొత్తం 11 మంది స‌భ్యులుగా ఉంటార‌ని వివ‌రించారు. సంబంధిత‌ ఇత‌ర వ్య‌వ‌హారాల‌ను క్రీడా ప్రాధికార సంస్థ‌, యువ‌జ‌న శాఖలు స‌మ‌న్వ‌యంతో ప‌ర్య‌వేక్షిస్తాయ‌ని పేర్కొన్నారు. జులై ప్ర‌థ‌మ భాగంలోనే సంఘాలను ఏర్పాటు చేయాల‌ని యువ‌జ‌న‌, క్రీడా ప్రాధికార సంస్థ అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే నైపుణ్య క్రీడాకారుల‌ను గుర్తించి వారికి త‌గిన త‌ర్ఫీదు ఇచ్చి వారిని మండ‌ల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త క్రీడా సంఘాల‌పై ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. వారికి స‌రైన తోడ్పాటు అందించ‌టం ద్వారా మంచి యువ‌త‌గా తీర్చిదిద్దాల‌ని సూచించారు. ప్ర‌తి మూడు నెల‌ల‌కు మండ‌ల‌, జిల్లా స్థాయిలో స్పోర్ట్స మీట్‌లు ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement