విజయనగరం, ప్రభన్యూస్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా వుందన్న వాదనలు సర్వత్రా వినిపించాయి. ఆంధ్ర ప్రదేశ్‌కు మరోమారు రిక్త హస్తమే చూపిందన్న ఆవేదన అందరిలో వ్యక్తమైంది. భారతీయ జనతా పార్టీ మినహాయిస్తే ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు కార్మిక, ప్రజా సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంగా కనీసం ప్రస్తావించని నేపథ్యం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.వేతన జీవులకు మొండిచేయి చూపించిన కేంద్ర బడ్జెట్ రైతులు, పేదల కోసం ఏమి చేయనుందో స్పష్టత కూడా ఇవ్వలేకపోయిందన్నది అధిక సంఖ్యాకుల వాదన..వేదన. రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు లేకుండా దీర్ఘ కాలిక ప్రయోజనాలు సమకూరుతాయంటూ బడ్జెట్ సినిమా చూపారు తప్ప ఏ ఒక్క వర్గానికి మేలు చూపని అధ్వాన్న బడ్జెట్ ఇదంటూ ఆక్షేపణలు వెల్లువెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్శిటీలకు రూ.40 కోట్లు, ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ.50 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపించిందంటూ మేధావి వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి జోలికి పోకుండా బడ్జెట్ రూపకల్పన చేయడం ఏపీకి తీవ్ర అన్యాయం చేయడమేనని దాదాపుగా అన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీకి అన్ని విధాలా నిరాశపరచిన కేంద్ర బడ్జెట్ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలు సహా రైతులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నది నిర్వివాదాంశంగా చెప్పవచ్చు.
సామాన్యులకు ఒరిగిందేమీ లేదు : ఎమ్మెల్యే కోలగట్ల..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌తో సామాన్యులకు ఒరిగిందేమీ లేదని అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఆక్షేపించారు. దిశానిర్దేశం లేని బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. ఉద్యోగులు, చిరు వ్యాపారులను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు జరపకపోవడం దురదృష్టకరమన్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేంద్రం రిక్తహస్తం చూపడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి ఊసే లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్ నిరాశాజనకం:టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి..
కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా వుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆక్షేపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ చేయగలిగిందేమీ లేదని మరోమారు నిరూపితమైందన్నారు. 28 మంది వైసీపీ ఎంపీలు వున్నప్పటికీ వారు ఏపీ కోసం చేసింది శూన్యమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం నిధుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చీకటి ఒప్పందాలు, రహస్య మంతనాలతో ముఖ్యమంత్రి కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారని ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాలు గోధుమ మద్ధతు ధరకై కేంద్రంపై ఒత్తిడి తెస్తుంటే ఏపీ ప్రభుత్వానికి చేతగాక వరి పండించొద్దని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
విద్య,ఆరోగ్యం,ఉపాధి..ఎక్కడ? : భీశెట్టి బాబ్జి..
విద్య,వైద్యం-ఆరోగ్యం,ఉపాధి వంటి కీలక రంగాలు విస్మరించబడ్డాయని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జిd అభిప్రాయపడ్డారు. దీర్ఘ కాలిక ప్రయోజనాల గురించి గొప్పగా వల్లెవేసిన కేంద్ర బడ్జెట్ అధికారంలో వుండగా ఏమీ చేయబోమని చెప్పకనే చెప్పినట్లయిందన్నారు. వ్యవసాయాన్ని అశ్రద్ధ చేసిన బడ్జెట్ ఇది అంటూ పేర్కొన్న బాబ్జి చట్టబద్ధమైన పాలన గురించి శ్రద్ధ వహించని నేపథ్యం నెలకొందన్నారు. ఆరోగ్య వ్యవస్థను అస్తవ్యస్తంగానే వదిలేసిన ఘనత కూడా మోదీ సర్కార్‌దేనన్నారు.
కేంద్రం చేసిన ద్రోహం ఇది : బుగత అశోక్..
మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏపీకి కేంద్రం చేసిన ద్రోహం తీవ్రతను చాటిచెప్పిందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన 80 అంశాల్లో ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటివి మచ్చుకైనా ప్రస్తావనకు తీసుకురాకపోవడం దారుణమన్నారు. రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో విస్మరించడం దురదృష్టకరమన్నారు. బడాబాబులకు మేలు చేసే ఈ బడ్జెట్‌లో ఏపీకి ఒరగబెట్టింది శూన్యమన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..