విజయనగరం, ప్రభన్యూస్ : దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని.. వ్యవహారం జిల్లాలో పునరావృతం కానుందా? అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. నిధులు లేక అభివృద్ధి జరగడం లేదన్న వేదన ప్రజలదైతే పుష్కలంగా నిధులున్నా వెచ్చించక వెనక్కి మళ్లించే చరిత్ర జిల్లా అధికార యంత్రాంగానిది. అభద్రతా భావంతో వుంటున్నారో? ఏమో? తెలియదు గానీ అమాత్యులు కూడా ఉపాధి కన్వర్జెన్స్ పనుల్లో నిర్లక్ష్యాన్ని పట్టించుకున్న పానాన పోలేదు. కారణాలపై ఆరా తీసి బాధ్యులపై చర్యలు తీసుకున్న సందర్భాలు మచ్చుకైనా లేకపోవడంతో సంబంధిత అధికారులు అమాత్యులు తమకు మద్ధతిస్తున్నారని బలంగా నమ్మి నిర్లక్ష్య వైఖరిని యథావిధిగా కొనసాగిస్తున్నారు. సాధారణంగా కూలి పనులు చేసుకున్న వారు అధికంగా వున్న విజయనగరం జిల్లాలో ఉపాధి పనిదినాలను ఘనంగా చూపించి అవార్డులు దక్కించుకునే ఆనవాయితీని కొనసాగిస్తున్న బాధ్యులు అధిక పనిదినాలు/జాబ్‌కార్డుల వల్ల సమకూరే కోట్లాది రూపాయిల కన్వర్జెన్స్ నిధులతో అభివృద్ధి చేసేందుకు విముఖత చూపుతున్నారు. విజయనగరం జిల్లా ప్రజల విషయంలో ఇదొక శాపమో.. జిల్లా చేసుకున్న పాపమో.. తెలియదు గానీ రూ.కోట్ల మొత్తంలో నిధులు మురగపెట్టి వెనక్కి పంపించే విషయంలో ఏ పార్టీ అధికారంలో వున్నా.. అమాత్యులు ఎవరైనా.. అదే పనితనం కనిపిస్తోందన్నది సుస్పష్టం. ఫలితంగా అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమాత్యులకు పట్టక.. ముఖ్యమంత్రికి పట్టింపులేక.. వెనుకబడిన జిల్లా ప్రగతి తిరోగమనంలో పయనిస్తోంది.
అదలా వుంచితే… గడిచిన ఏళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా మరో రూ.208 కోట్లు వెనక్కి మళ్లిపోయే పరిస్థితులు స్పష్టంగా తెలుస్తున్నాయి. కోట్లాది రూపాయిల ఉపాధి కన్వర్జెన్సీ నిధులు వెచ్చించడంలో అధికారులు విఫలమవుతూ వచ్చి వెనుకబాటు జిల్లాను మరింత వెనక్కి నెట్టేస్తున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కాదు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అధికారుల అచేతనత్వం.. నిర్లక్ష్యం.. కారణంగా కోట్లాది రూపాయిల నిధులు వెనక్కి మళ్లిపోయిన దుస్థితి. తాజాగా 2019, 2020 సంవత్సరాల్లో నెలకొన్న పరిస్థితులనే అధ్యయనం చేస్తే జిల్లాలొ కన్వర్జెన్సీ పనులు చేపట్టలేక, చేపట్టినా ముగించలేక 2019లో ఏకంగా రూ.311 కోట్లు వెనక్కి మళ్లిపోయాయి. అయినా ఏమాత్రం సీరియస్‌గా పరిగణించని జిల్లా అధికార యంత్రాంగం 2020లో కూడా దాదాపుగా అదే అలసత్వాన్ని ప్రదర్శించింది. ఫలితంగా రూ.211 కోట్ల నిధులు వెనక్కి మళ్లిపోయాయి.
ఈ ఏడాది కూడా మన అధికారులు అదే బాటలో పయనిస్తారేమో అన్నట్లున్నాయి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు. ఎందుకంటే ఉపాధి కన్వర్జెన్సీ నిధులు ఈ ఏడాది కూడా రూ.440 కోట్ల వరకు అందుబాటులో వున్నా అవి సక్రమంగా సకాలంలో వెచ్చించే పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. సచివాలయాలు(664), రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే)618,వెల్నెస్ కేంద్రాలు 495, బల్కుమిల్కు కేంద్రాలు220, డిజిటల్ గ్రంధాలయాలు195.. వెరసి మొత్తంగా 2192 భవన నిర్మాణాల పనులు మంజూరు కాగా ఇంత వరకు పూర్తయినవి కేవలం 340 లోపే. 12 సచివాలయాలు, 38 రైతు భరోసా కేంద్రాలు, 59 వెల్నెస్ కేంద్రాలకు సంబంధించిన భవన నిర్మాణాలు ఇప్పటికీ మొదలు కాని పరిస్థితి. బల్కుమిల్కు కేంద్రాలు, డిజిటల్ గ్రంధాలయాలు అయితే ఒక్కటీ ప్రారంభం కాని పరిస్థితి. ఇంతవరకు మొత్తంగా వెచ్చించింది కేవలం రూ.232 కోట్లు మాత్రమే. ఈనెల మిగిలి వున్న 16 రోజుల్లో అక్షరాలా రూ.208 కోట్లు వెచ్చించాల్సి వుందని అధికారిక నివేదికలు చెబుతున్నాయి. అమాత్యుల సమీక్షలు, అధికారుల సమీక్షలు.. వెరసి ఇస్తున్న ఫలితాలేంటన్నది రూ.కోట్లాది నిధులు వెనక్కి మళ్లిపోయే ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా సోమవారం కలెక్టర్ ఎ.సూర్యకుమారి కన్వర్జెన్సీ పనులపై సమీక్ష నిర్వహించారు. లక్ష్యం నిర్దేశించుకొని అందుబాటులో వున్న నిధులు వెచ్చించాల్సిందేనని హుకుం జారీ చేశారు. మరి ఏమి కానుందో వేచి చూడాల్సిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..