Tuesday, November 26, 2024

VZNM: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్

పార్వతీపురం, డిసెంబరు 2 (ప్రభ న్యూస్) : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. సీతానగరం మండలం సూరంపేట గ్రామ రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పరికరాలు పరిశీలించారు. తూనిక యంత్రంపై ధాన్యం బస్తాను పెట్టి తూనికలను పరిశీలించారు. ధాన్యం తేమ శాతం తనిఖీ చేశారు. ధాన్యం రవాణా లారీకి జెండా ఊపి రవాణాకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఖరీఫ్ 2023-24 సీజనుకు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. జిల్లాలో 185 రైతు భరోసా కేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ద్వారా ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు తాము పండించిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నట్లు చూడాలని, దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యంను విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని ఆయన కోరారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధాన్యం సేకరణ సహాయ ఏజన్సీలకు అనుసంధానం చేశామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.


మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించవద్దు..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంను విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఒక క్వింటాల్ కు ప్రభుత్వం సాధారణ రకంకు రూ.2183/- లు, గ్రేడ్-ఏ రకానికి రూ.2203/- లు నిర్ణయించిందని ఆయన చెప్పారు.

- Advertisement -


కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల సందేహాల నివృత్తి, సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పని చేస్తుందని ఆయన చెప్పారు. జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 08963-293037, 7702003582లకు నేరుగా ఫోన్ చేసి సంప్రదించవచ్చని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్ 1800-4251967, రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నంబరు 1967 కూడా పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం డి నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement