అన్న క్యాంటీన్లకు నెల జీతం విరాళంగా ప్రకటించిన మంత్రి కొండపల్లి
మాజీ కేంద్ర మంత్రి అశోక్, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలసి ప్రారంభించిన మంత్రి
విజయనగరం, ఆగస్టు 16(ప్రభ న్యూస్) : పేదలకు, కార్మికులకు, విద్యార్ధులకు అన్న క్యాంటీన్ల వల్ల ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఇ., సెర్ప్, ఎన్నారై వ్యవహరాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రోజువారీ పనులు చేసుకొనే కార్మికులు, విద్యార్ధులు, నిరుపేదలు ఈ క్యాంటీన్లలో తక్కువ ఖర్చుతో కేవలం రూ.5లకే రుచికరమైన భోజనం, టిఫిన్ పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అన్నక్యాంటీన్లను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, పేదల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సమాజంలోని అన్ని వర్గాల వారు విరాళాల రూపంలో తమ వంతు సహకారం అందించాలన్నారు.
నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్, మునిసిపల్ మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెండు అన్న క్యాంటీన్లను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో కలసి శుక్రవారం మంత్రి కొండపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అన్న క్యాంటీన్ లో టిఫిన్‌ను మంత్రి కొండపల్లి, అశోక్ గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్‌లతో కలసి పలువురికి వడ్డించారు. అనంతరం వారంతా అక్కడే టిఫిన్ చేశారు. అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌లో టిఫిన్ రుచికరంగా ఉందని పేర్కొన్నారు.
అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ… పేద ప్రజలకు ఇదో గొప్ప రోజని, ఈ క్యాంటీన్ల ద్వారా గతంలో వారికి ఎంతో మేలు జరిగిందన్నారు. అటువంటి క్యాంటీన్లను ఈరోజు మళ్లీ ప్రారంభించడం సంతోషంగా వుందన్నారు. బొబ్బిలిలోనూ మరో క్యాంటీన్ నేటి నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ వ్యవధిలోనే ఈ క్యాంటీన్ లు ఏర్పాటు చేయగలిగామని, అక్షయపాత్ర సంస్థ వీటి నిర్వహణకు ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. రాష్ట్రాన్నిఒక మంచి దశలోకి తీసుకువెళ్లేందుకు, మంచి భవిష్యత్తు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరింత శక్తి లభించేలా ప్రజలు ప్రారంభించాలన్నారు. అన్న క్యాంటీన్లను స్వయం సమృద్ధం కావాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ప్రజల నుంచి విరాళాలు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
నెల జీతం విరాళంగా ప్రకటించిన మంత్రి..
అన్న క్యాంటీన్ల నిర్వహణకు తన నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తన నాన్నమ్మ స్మారకంగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్ కు అందించనున్నట్టు పేర్కొన్నారు.
అన్న క్యాంటీన్ల తరహాలో పేదలకు, విద్యార్ధులు, అసహాయులకు అన్నంపెట్టే సంస్కృతి విజయనగరం జిల్లాలో ఏనాటి నుంచో వుందని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. విద్యార్ధులతో పాటు శ్రమజీవులందరికీ తక్కువ ధరకే భోజనం చేసే అవకాశం ఏర్పడుతోందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏర్పాటు చేసిన ఉక్కు వ్యవస్థను గత ప్రభుత్వం తుప్పు పట్టించిందని, ఆ తుప్పును తొలగించి మళ్లీ వ్యవస్థలను పటిష్ట పరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో అన్నం పెట్టకపోవడమే కాకుండా అన్నం పెట్టే వారిపై కూడా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందరూ సహకరిస్తేనే అన్న క్యాంటీన్ల వ్యవస్థ భవిష్యత్తులో నిరాటంకంగా నడుస్తుందని కేంద్ర మాజీ మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో విరాళాలను ఈ కార్యక్రమానికి అందించాలని కోరారు. అన్ని కార్యక్రమాల కంటే ఇందులో ప్రజా భాగస్వామ్యం విజయనగరంలో అధికంగా వుందని మనమంతా నిరూపించాలన్నారు.
అన్న క్యాంటీన్ల ఏర్పాటు వల్ల నిరుపేదలు, కార్మికులు, విద్యార్ధులు, ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి సహాయకులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ఇదే తరహాలో గిరిజన ప్రాంతాల్లోనూ ప్రతి మండలంలో ఒకటి ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు.
శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతి మాట్లాడుతూ.. పేదలకు, విద్యార్ధులకు ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తుండటం సంతోషంగా వుందన్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు రూ.6లక్షలు ప్రజల నుంచి విరాళాల రూపంలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఎం.ఎం.నాయుడు, మునిసిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మునిసిపల్ కార్యాలయం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అతిధి గజపతి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అన్న క్యాంటీన్ విరాళాల కోసం బ్యాంకు ఖాతా ఏర్పాటు..
అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళాలు ఇచ్చే వారికోసం ప్రభుత్వం ఒక బ్యాంకు ఖాతా ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్. అంబేద్కర్ చెప్పారు. గుంటూరు చంద్రమౌళి నగర్ భారతీయ స్టేట్‌బ్యాంకు బ్రాంచిలో గల 37818165097 నెంబరుతో గల బ్యాంకు ఖాతాకు ప్రజలు తమ విరాళాలు జమచేయవచ్చన్నారు. ఈ బ్యాంకు బ్రాంచి ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్ SBIN0020541 గా వుందని పేర్కొన్నారు.