Tuesday, November 26, 2024

సింహగిరిపై విజయదశమి వేడుకలు.. రామాయణ నవరాత్రి పారాయణం

విశాఖపట్నం , ప్రభన్యూస్‌ బ్యూరో : ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ప్రతీ రోజు రామాయణ నవరాత్రి పారాయణం నిర్వహించనున్నారు. అంతేకాకుండా లక్ష్మీదేవి సన్నిదిలో కుంకుమార్చనలు, ఆయుధపూజ కూడా జరపనున్నారు. ఇక విజయదశమి పర్వదినాన సింహాద్రినాధుడి జమ్మివేట ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆరోజు స్వామిని సర్వాభరణాలుతో అందంగా తీర్చిదిద్ది కొండ దిగువన ఉద్యావనంకు తీసుకురానున్నారు. జమ్మిచెట్టు నుంచి ఆకులు సేకరించి స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక అర్చన గావించనున్నారు.

పురాణ ఇతిహాస కథనాలు ప్రకారం జమ్మిచెట్టు విజయానికి స్పూర్తిగా చెబుతారు. అందువల్లే ఆలయ చరిత్రలో జమ్మివేట ఉత్సవం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇక సింహాద్రినాధుడి ఆలయ క్షేత్రపాలకుడు త్రిపురాంతక స్వామి ఆలయంలో కూడా సోమవారం నుంచి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ బాలాత్రిపుర సుందరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం, ప్రత్యక్ష, పరోక్షంగా రూ.1000 టిక్కెట్‌ కొనుగోలు చేసిన వారికి మహన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం , అమ్మవారికి శ్రీ చక్రనామార్చనతో భక్తుల పేరిట పూజలు నిర్వహించనున్నారు. కావున ఆయా సేవలలో భక్తులు భాగస్వాములు కావాలని ఆలయ ఏఇఓ ఎన్‌.ఆనంద్‌కుమార్‌ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement