విశాఖపట్నానికి రాజధాని రావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఖాయమని స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు తగ్గట్టు విశాఖ కేంద్రంగా అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అయితే, తేదీ ఎప్పుడు అనేది తామే చెబుతామన్నారు. భూమి విలువ ఆధారంగా ఇంటిపన్ను పెంచడం జరుగుతుందని పేర్కొన్నారు. 15 శాతం కన్నా ఎక్కువగా టాక్స్ పెరిగే అవకాశం లేదన్నారు. మురికివాడల రహిత నగరంగా అభివృద్ధి చేయాలన్నసీఎం జగన్ ఆలోచన అమలు చేస్తామని చెప్పారు. విశాఖలో తాగునీటి సమస్య లేకుండా రూ.500 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
విశాఖలో భూములు తాకట్టు పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీ దుష్ప్రచారం చేస్తోందిన మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొనేటప్పుడు ఆస్తులు గ్యారెంటీ చూపించడం సర్వసాధారణమని విజయసాయిరెడ్డి వివరించారు. జెఎన్ఎన్‌యుఆర్ఎం ఇళ్ల మరమ్మతులకు ఒక్కో ఇంటికి పదివేల రూపాయలు కేటాయిస్తున్నామని విజయసాయిరెడ్డి వివరించారు.