Monday, November 25, 2024

AP | జయం మనదే.. ఏమాత్రం ఏమరపాటు పనికిరాదు: స‌జ్జ‌ల‌

అమరావతి, ఆంధ్రప్రభ: వచ్చే ఎన్నికల్లో వైయస్సార్‌ సిపి విజయం ఖాయమైందని సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలనపై ప్రజల అంచంచల విశ్వాసమే పార్టీ విజయానికి కారణం కాబోతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో వైయస్సార్‌ సిపి 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులతో గురువారం సమావేశం నిర్వహించారు. పార్టీ పరిశీలకులు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలో సజ్జల దిశా నిర్ధేశం చేశారు.

పార్టీ విజయం ఖాయమైంది కదా అని ఏమాత్రం ఏమరపాటు- పనికిరాదన్నారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి ఒడిగడుతూ ఎన్ని కుయక్తులు పన్నినా ప్రజలు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డిసైడ్‌ అయ్యారన్నారు. చంద్రబాబు,లోకేష్‌,పవన్‌ కల్యాణ్‌ వంటి వారు చెబుతున్న మాటలను విశ్వసించే స్దితిలో ప్రజలు లేరన్నారు. అందుకే వాళ్ళు ఏమీ పాలుపోని స్దితిలో అర్దంపర్దంలేని ఆరోపణలతో అయోమయం సృష్టిస్తున్నారని అన్నారు.

- Advertisement -

విభేదాలకు తావివ్వొద్దు

ప్రతి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులన్నీ విభేదాలకు తావులేకుండా ఐకమత్యంతో పనిచేసేలా చేయాల్సిన బాధ్యత పార్టీ పరిశీలకులుగా నియమితులైన వారిపై ఉందని సజ్జల పేర్కొన్నారు. రానున్న కాలం ఎంతో కీలకమైందనే విషయం పరిశీలకులు గుర్తించాలన్నారు. ఏ నియోజకవర్గానికి పరిశీలకులుగా నియమితులయ్యారో ఆ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడంలో ఎంఎల్‌ఏ కు,నియోజకవర్గ పార్టీ ఇన్‌ ఛార్జ్‌ కి తలలో నాలుకలాగా వ్యవహరించాలన్నారు.

ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో సహాయకారిగా ఉండాలన్నారు. బోగస్‌ ఓట్లను తొలగించడం,అర్హులైన వారిని ఓటర్లుగా చేర్పించడం వంటివాటిపై దృష్టి సారించాలన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు తన కుయుక్తులతో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లను చేర్పించారు. వాటిని గుర్తించి ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చి వాటిని తొలగించేందుకు పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని కోరారు.గృహసారధులు,పార్టీ శ్రేణుల సమన్వయంతో పనిచేసి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాల్లో పనిచేయాలన్నారు.

ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నియోజకవర్గంలో కిందిస్దాయి నేతల మధ్య అసంతృప్తి ఉంటే వాటిని గుర్తించడం వారి స్దాయిలోనే పరిష్కారంకోసం కృషిచేయాలన్నారు.ఇంకా అవసరమైతే వాటిని రీజనల్‌ కోఆర్డినేటర్‌,పార్టీ జిల్లా అధ్యక్షుడు,ఇంకా అవసరమైతే కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని కోరారు. నియోజకవర్గస్దాయిలో సోషల్‌ మీడియా టీ-మ్‌ లను బలోపేతం చేసే దిశగా పరిశీలకులు దృష్టి సారించాలన్నారు.ఆయా నియోజకవర్గాలలో ప్రజలకు అందుతున్న పథకాలను, ,వాటి లబ్దిని ఇతర అభివృద్ది పనులను ప్రజలకు వివరించేలా సోషల్‌ మీడియా పనిచేయాలని కోరారు.అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

మీ బాధ్యతే మీ అధికారం

మీకు అప్పగించిన బాధ్యతే మీ అధికారం అనేది పరిశీలకులు గుర్తించాలన్నారు. పరిశీలకులు నియోజకవర్గంలో అడుగుపెట్టిన అనంతరం అసెంబ్లీ అభ్యర్ది,ఎంఎల్‌ ఏ,నియోజకవర్గ ఇన్‌ ఛార్జ్‌ లు… పరిశీలకులపై డిపెండ్‌ అవ్వడం మొదలుపెడితే అదే అధికారం అవుతుందన్నారు. రీజనల్‌ కోఆర్డినేటర్‌ పరిశీలకులతో మాట్లాడేలాగా పరిశీలకులు చెబుతున్న సమాచారం ఆధారంగా ఆయా నియోజకవర్గాలలో యాక్షన్‌ టేకప్‌ చేసినా అదే పరిశీలకులకు తగిన గుర్తింపు అవుతుంది.క్రియాశీలకంగా మనస్సు పెట్టి పనిచేయాలని అన్నారు.రానున్న9 నెలల కాలంలో పనిచేసిన అనంతరం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక పరిశీలకులందరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

పరిశీలకులకు పార్టీ అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలువురు పరిశీలకులు మాట్లాడుతూ నియోజకవర్గాలలో పార్టీ పరిస్దితులను వివరించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి చాలా సానుకూలంగా వాతావరణం ఉందని ఇందుకు ముఖ్యమంత్రి జగన్‌ అందిస్తున్న పధకాలు,పారదర్శకపాలన దోహదం చేస్తున్నాయన్నారు. క్షేత్ర స్దాయిలో పార్టీలో చిన్న చిన్న విభేదాలు పరిష్కరించాలంటే ఏం చేయాలో వారు పలు సూచనలు సలహాలు అందించారు. వాటిని తగిన విధంగా పరిష్కరిస్తామని, సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్తామని సజ్జల వారికి తెలియచేశారు.

ఎన్నికలకు సమాయత్తం చేసేలా శిక్షణ

మావేశం అనంతరం మీడియాప్రతినిధులతో పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు,శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న అబధ్దపు ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా వాస్తవాలు ప్రజలకు తెలియచేసి చైతన్యవంతం చేయాలని ఇందుకు తగిన విధంగా పరిశీలకులు పనిచేయాలని కోరామన్నారు. పరిశీలకులు పార్టీకి మేలు చేసే విధంగా పనిచేయాలని,ఎక్కడా కూడా అధిపత్యధోరణులు ఉండకూడదన్నారు. కార్యకర్తలందరిని ఎన్నికలకు సమాయత్తం చేసే విధంగా ఎటు-వంటి చర్యలు చేపట్టాలో పరిశీలకులకు తెలియచేయడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement