Thursday, November 21, 2024

Delhi | గెలుపు మాదే, ఏపీని పునర్నిర్మిస్తా.. ఢిల్లీ మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్టి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా అశాంతి నెలకొందని, ప్రజలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తీవ్రంగా విసిగిపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మధ్యాహ్నం ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చ జరిపారు. సమావేశం తర్వాత ఢిల్లీ తెలుగు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు.

తాజాగా తాను నిర్వహించిన సభలు, సమావేశాలకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారని ఉదహరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వంపై వ్యతిరేకతకు అదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పునర్మించడమే తన లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్ నగరంలో తాను రూపొందించిన బ్లూ-ప్రింట్, ప్రణాళిక తదుపరి వచ్చిన పాలకులు చెదరగొట్టకపోవడం వల్ల అభివృద్ధిలో దూసుకెళ్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన సూత్రీకరించారు. దీనంతటికీ తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో వేసిన పునాదులే కారణమని చెప్పుకొచ్చారు. తదుపరి వచ్చిన పాలకులు ఎవరూ కూడా ఆ ఎకో సిస్టమ్‌ను కొనసాగించడమో, కొంతమేర ప్రోత్సహించడమో లేదంటే చెదరగొట్టకుండా ఉండడమో చేశారని తెలిపారు.

ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో నిర్మించిన ఫ్లై-ఓవర్లు, మెట్రో రైలు కారణంగా నగరంలో ట్రాఫిక్ పరిస్థితి మెరుగుపడిందని ప్రశంసించారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం వాతావరణాన్ని చెదరగొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని చంద్రబాబు అన్నారు. ఫలితంగా కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవే తరలిపోతున్నాయని చెప్పారు. అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ తెలంగాణలో పెట్టుబడుల అంశాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదాహరించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే ఉన్నాయని అన్నారు. నిజానికి ప్రాజెక్టులో భాగంగా భారీ డ్యామ్ నిర్మించాల్సిందిపోయి బ్యారేజ్ మాదిరిగా పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

విజన్ 2047..

సోమవారం రాత్రి జరిగిన జీ-20 సన్నాహక సదస్సు గురించి కూడా చంద్రబాబు పిచ్చాపాటి మాట్లాడారు. విజన్ 2047 పేరుతో లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సూచించినట్టు తెలిపారు. ఇందులో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తాను సరికొత్త టెక్నాలజీ వినియోగించడమే కాదు, ప్రజోపయోగకరమైన పరిజ్ఞానాన్ని అందరికీ తెలిసేలా ప్రమోట్ చేస్తానన్నారు. జీ-20లో చేసిన ప్రసంగానికి తోడు మంగళవారం మధ్యాహ్నం ఆయన నీతి ఆయోగ్ కార్యాలయంలో కొందరు ఉన్నతాధికారులను కలిసి తన ప్రణాళికల గురించి మరికొన్ని సూచనలు చేసినట్టు తెలిపారు.

టెక్నాలజీ విజయాల గురించి చెబుతూ.. ర్యాపిడో, షేర్‌చాట్ వంటి విజయవంతమైన టెక్నాలజీ ఆధారిత వ్యాపారాలను ఉదహరించారు. ఒక ఆలోచనకు కృషి తోడైతే ఎంతటి అద్భుతాలు సాధించవచ్చో అని చెప్పడానికి ఇంకా అనేక ఉదాహరణలున్నాయని అన్నారు. తాను ఐటీని ప్రోత్సహించడం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యువత సంపాదన పెరిగిందని, విదేశాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు.

అరచేతిలో ఆరోగ్యం..

అరచేతిలోనే ఆరోగ్యం ఉందని చంద్రబాబు అన్నారు. ఆహారమే ఔషధమని, ప్రకృతే ఫార్మసీ అని తెలిపారు. ఈ సందర్భంగా తన చేతి వేలికి పెట్టుకున్న ఉంగరం (స్మార్ట్ రింగ్) చూపిస్తూ అది శరీరంలోని బీపీ, షుగర్ స్థాయులు, హార్ట్ రేట్, నిద్ర సమయం సహా అనేక అంశాలను అనుసంధానించిన మొబైల్ ఫోన్లో ఎలా చూపిస్తుందో వివరించారు. అలాగే తమ ట్రస్ట్ ద్వారా రూపొందించిన ఒక మొబైల్ యాప్ గురించి వివరించారు. ఏడాదిలో ఒకసారి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, ఆ సమాచారాన్ని యాప్‌లో నిక్షిప్తం చేస్తే.. మనం ఏరకమైన ఆహారం తీసుకోవాలో యాప్ సూచిస్తుందని, తద్వారా పూర్తి ఆరోగ్యకరమైన జీవనం గడపవచ్చని వెల్లడించారు. మొత్తంగా మన అరచేతిలోనే ఆరోగ్యం ఉందని, టెక్నాలజీ తోడుంటే డాక్టర్ అవసరమే రాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జనాభా వరమే..

ఒకప్పుడు జనాభా పెరిగితే సమస్యగా చిత్రీకరించేవారని, కానీ ఇప్పుడు జనాభాను వనరులుగా మార్చుకుంటే వరమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను గతంలో “పిల్లల్ని కనండి, జనాభాను పెంచండి” అంటూ చేసిన వ్యాఖ్యాల్ని వివాదాస్పదం చేశారని, కానీ నేడు ప్రపంచంలో భారతదేశం ఒక్కటే యువశక్తితో ఉందని గుర్తుచేశారు. అదే భారత్‌కు వరంగా మారిందని అన్నారు. కొన్నాళ్లు పోతే ముందు దక్షిణ భారతదేశంలో వయస్సుమళ్లినవారి సంఖ్య పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. ఒకప్పుడు జనం పెరిగితే వనరులు సరిపోవని అనేవారని, కానీ జనమే వనరులు అన్న విషయాన్ని మర్చిపోతున్నారని ఆయనన్నారు. అయితే జనాభాను మెరుగైన మానవ వనరులుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు ఉండాలన్నారు. జనాభా పెరుగుదలతో ఉత్పాదకత, అభివృద్ధి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణపైనా దృష్టి

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం చేస్తామని చంద్రబాబు అన్నారు. ఈమధ్యనే రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఏపీ కంటే తెలంగాణలోనే బలమైన క్యాడర్ ఉండేదని, ఆదరణ కూడా ఉండేదని అన్నారు. ఆ తర్వాత అనేక రాజకీయ పరిస్థితుల కారణంగా క్యాడర్ ఇతర పార్టీలకు తరలిపోయిందని, కానీ పార్టీని అభిమానించే ఓటర్లు ఇంకా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే తెలంగాణలో పార్టీని పునర్నిర్మించే ప్రయత్నాలు ప్రారంభిస్తామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీడియాతో మాటామంతి అనంతరం ఆయన ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement