విశాఖపట్నం, నవంబర్21 (ప్రభ న్యూస్): విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో బాధితులకు అందించే నష్టపరిహరం విషయంలో వివక్షత లేకుండా అందరికీ పూర్తిస్ధాయిలో నష్టపరిహారాన్ని చెల్లించాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ టీడీపీ నాయకుల బృందం ప్రమాద ఘటన స్ధలాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటి సారని, బోట్ యజమానుల బాధలు విన్నామని, ప్రభుత్వం 80శాతం నష్టం పరిహారం అందిస్తామంటున్న నేపధ్యంలో అన్ని ఇతర అనుబంధ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బోట్ లో వున్న సామాగ్రిని కూడా పూర్తిస్ధాయిలో లెక్క కట్టాలని మత్స్యశాఖ అధికారులను కోరామన్నారు. మత్స్యకారులంతా శాశ్వతంగా కోలుకునేలా ఎలాంటి షరతులు లేకుండా ఉదారంగా సహాయం చేయాలన్నారు. అదేవిధంగా బోటు వయస్సుతో నిమిత్తం లేకుండా సాయం చేయాలని, సర్వీస్ ను లెక్క కడితే నష్టపోతారని, పూర్తి నష్టపరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.