విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. పరిశ్రమలో ఒక్కసారిగా భారీ శబ్బం వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు సైరన్ మోగించిన ఉద్యోగులను అందరినీ బయటకు పంపారు.
హెచ్‌పీసీఎల్ పాత టెర్మినల్ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏ విభాగంలో ప్రమాదం జరిగింది, కారణాలు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పేరుకుపోయిన కర్బన పదార్థాలు అప్పుడప్పుడూ పేలడం ఇక్కడ సర్వసాధారణం అయితే, తాజా ప్రమాదంలో మరీ ఎక్కువగా మంటలు ఎగసిపడుతుండటంతో భారీ ప్రమాదమే జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
విశాఖ హెచ్పీసీఎల్లో మూడు యూనిట్లు ఉన్నాయి. తాజా ప్రమాదం మూడో యూనిట్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇది చాలా సున్నితమైన యూనిట్, అతి ఎక్కుగా మండే పదార్థాలు ఇక్కడ ఉంటాయి. నిరంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉంటారు. అత్యాధునిక పరికరాలతో ప్రస్తుతం మంటలు అదుపు చేస్తున్నారు. అంతేకాకుండా విశాఖ పట్నం నుంచి కొన్ని అగ్నిమాపక యంత్రాలను తీసుకొచ్చారు. ఇక్కడ నీటితో మంటలను అదుపు చేసే వీలుండదు.. కేవలం కొన్ని రసాయనాలతో మాత్రమే మంటలను మంటలను ఆర్పాలి.ఎవరికైనా అత్యవసర సమయంలో వైద్య సేవలను అందించేందుకు కొన్ని అంబులెన్స్‌లను కూడా అక్కడ సిద్ధం చేశారు.