కడప ప్రతినిధి, (ప్రభ న్యూస్) : భాషా ప్రాచీనతను పరిరక్షించుకోవటంతో పాటు భాష మనుగడను కాపాడుకోవటం అత్యంత ఆవశ్యకమని భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గురువారం ఎర్రగుంట్ల మండలంలోని కలమల్లలో.. తొలితెలుగు శిలాశాసనం వెలుగు చూసిన చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో.. గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహిస్తున్న తెలుగుబాషా దినోత్సవ వేడుకలకు.. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎమ్మెల్యే చడిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, జేసీ అదితి సింగ్, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, బిజెపి యువనాయకులు భూపేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్శన ద్వారా ఓ మహోన్నత ప్రాచీన భాషకు వారసునిగా గర్విస్తున్నానని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ గర్వపడాలని సూచించారు. చొరవ తీసుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ సహా ప్రతి ఒక్కరినీ ఆయన మనసారా అభినందించారు.
ఇదే వేదిక నుంచి గిడుగు రామ్మూర్తి పంతులు గారికి నివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు, తెలుగును ప్రజల పరం చేసేందుకు, భాషను సౌకర్యవంతంగా, సరళంగా మార్చుకునే దిశగా వారి కృషిని గుర్తు చేసుకున్నారు. గిడుగు గారి స్ఫూర్తితో యువతరం తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో, మన సంస్కృతి కూడా అంతే ప్రాచీనమైనదన్న ఆయన… మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషే మన అస్తిత్వమని తెలిపారు.
భారతదేశంలో నాలుగో అతిపెద్ద భాషగా మన్ననలు అందుకుంటున్న తెలుగు, ప్రపంచ వ్యాప్తంగా మరెన్నో దేశాల్లోనూ తన ప్రాభవాన్ని చాటుతున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ఉత్తమ లిపిగా, అజంతా భాషగా తెలుగు అందుకున్న గౌరవాలను ప్రస్తావించారు. తెలుగు లాంటి మహోన్నత భాష ప్రాచీనతకు శిలాశాసనాలు సాక్ష్యంగా నిలుస్తాయన్న వెంకయ్యనాయుడు, శాసనాలను రాళ్లు, రప్పలుగా గాక మన సంస్కృతికి సంబంధించిన గొప్పలుగా చూడాలని ఆకాంక్షించారు.
శాసనాల ప్రాచీనత మీద వ్యక్తమౌతున్న సందేహాల విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్న ఆయన, ఇలాంటి శాసనాల భాష మీద ఆసక్తి పెంపొందే విధంగా చొరవ పెరగాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. శాసనాల పరిరక్షణ విషయంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ, శాసనాలను సంరక్షణ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు.
ఆధునిక కాలానికి తగినట్లుగా భాషా బోధనలో మార్పులు రావలసిన అవసరం ఉందన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, పాత తెలుగు పదాలను కాపాడుకోవటంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా నూతన తెలుగు పదాల సృష్టి జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సాహిత్యంతో పాటు సంగీతం, నాట్యం, ఆచారాలు, పండుగలు, సంప్రదాయ విజ్ఞానం, వృత్తుల వారసత్వం లాంటి వాటిని సంరక్షించుకోవడం మాతృభాషను కాపాడుకోవడం ద్వారానే వీలవుతుందన్న ఆయన భాష సంస్కృతులను ముందు తరాలకు సగర్వంగా చేరవేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ..
తెలుగులో అతి ప్రాచీనమైన సాహిత్యం సుమతి శతకం, బద్దెన కావ్యాలు మన కడప జిల్లా నుండే ఉద్బవించాయన్న విషయం గర్వించదగ్గదన్నారు. దాదాపు 1500 సంవత్సరాల క్రితం నాటి చారిత్రక నేపత్యం ఉన్న.. తెలుగు తొలి శాసనం మన ప్రాంతంలో కొలువై ఉండడం మన అదృష్టంగా భవిస్తున్నామన్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, జీవన విధానంలో తెలుగు భాషను మమేకం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగు భాషపై మమకారాన్ని మన ఇంటినుండే పెంపొందించాలన్నారు. ఎందరో బాషా పండితులు, కవులు, సాహితీవేత్తలు, కళాకారులకు పుట్టినిల్లు అయిన కడప జిల్లాలో తెలుగు బాషా వారసత్వ సంపద నెలవై ఉందని చెప్పుకోవడం మన అదృష్టంగా భవిచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజు గిడుగు వెంకట రామమూర్తి.. జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం సమిచితం అన్నారు.
గ్రాంధికమైన భాష వేళ్లూనుకున్న గత రోజుల్లో గిడుగు రామమూర్తి తెలుగు భాషను ఎంతో సరళంగా తెలుగువారికి తేనె దారలా అందించిన మహనీయులు అని ప్రశంసించారు. మాతృభాష కళ్ళ లాంటిది అమ్మ పాలు ఎంత శ్రేష్టమో.. మాతృ భాష స్వఛ్చమైనది, ఆరోగ్యకరమైనది అన్నారు. జమ్మలమడుగు శాసన సభ్యులు చడిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాషలో తొలి శిలాశాసనం వెలసిన ఈ కలమల్ల గ్రామం ఈ రోజు తెలుగు తేనెల దారలతో పునీతమైందన్నారు.
తెలుగు భాషా ఉన్నతమైనదని, పవిత్రమైనదని నేతికన్నా సరళమైనదన్నారు. ఈ రోజు గిడుగు వెంకట రామమూర్తి.. జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం సమిచితం అన్నారు. గ్రాంధికమైన భాష వేళ్లూనుకున్న గత రోజుల్లో గిడుగు రామమూర్తి తెలుగు భాషను ఎంతో సరళంగా తెలుగువారికి తేనె దారలా అందించిన మహనీయులు అని ప్రశంసించారు.
జిల్లాలో తెలుగు కవులకు సన్మానం…
అనంతరం.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గౌరవ అతిధుల చేతుల మీదుగా జిల్లాలో ప్రసిద్ధ తెలుగు కవులు షేక్ హుస్సేన్ (సత్యాగ్ని), నరాల రామిరెడ్డి, డా. పి.సంజీవమ్మ, సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి, తవ్వా ఓబుల్ రెడ్డి లను దుశ్శాలువ, జ్ఞాపికలతో సన్మానించారు.
కార్యక్రమం ముందుగా జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనా గీతంతో ఆరంభమై.. పలు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు, సాహితీవేత్తల ఉపన్యాసాలతో కన్నుల పండువగా సాగింది. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విద్యాలయాల్లో నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గౌరవ అతిధులు బహుమతులను, సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. చివరగా.. ఇంటాక్ సంస్థ వారు ప్రచురించిన “మన చరిత్ర” మాస పత్రికను, సాయి పినేని రచించిన “ఆంధ్ర పథం” పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సభ ప్రారంభానికి ముందు శ్రీ చెన్నకేషవ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం.. కలమల్ల శిలాశాసనాలు నెలకొల్పిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన తెలుగు భాష ప్రాచీన, పూర్వ వైభవాన్ని ప్రతిభింబించే ఛాయా చిత్రాల గ్యాలరీలను తిలకించి.. తెలుగు శిలా శాసనాల ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో సుధాకర్ రెడ్డి, డీఈవో అనురాధ, కడప బ్రౌన్ పరిశోధనా కేంద్రం ఇంచార్జి మూల మల్లికార్జునరెడ్డి, వివిధ శాఖల అధికారులు, బాషా ఉపాధ్యాయులు, ఆర్టిపిపి అధికారులు, పలు పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.