Friday, November 1, 2024

AP | వెలిగొండ రెండో సొరంగం పూర్తి… రాబోయే సీజన్‌ కు సాగు నీరు

ప్రతినిధి, పశ్చిమ ప్రకాశం: పశ్చిమ ప్రకాశం వర ప్రసాదిని వెలిగొండ ప్రాజెక్టు రెండవ సొరంగం పనులు పూర్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రెండవ సొరంగం వద్ద ఏంఇఐఎల్‌ కంపెనీ కార్మికులు విజయం సాధించినట్లు బేనర్‌ తో ప్రదర్శన చేశారు. జలవనరుల శాఖ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం వచ్చే సీజన్‌ నాటికి సొరంగం నుండి కృష్ణా జలాలను రిజర్వాయర్‌ కు చేర్చనున్నారు.

వెలిగొండ ప్రాజెక్టులో రెండు సొరంగాలు:

శ్రీశైలం రిజర్వాయర్‌ నుండి నలమల అటవీమార్గంలో దోర్నాల వద్ద కొత్తూరు రిజర్వాయర్‌ కు నీటిని తరలించేందుకు రెండు సొరంగాలు తవ్వేందుకు ప్రాజెక్టులో రూపకల్పన చేశారు. వీటిలో మొదటి సొరంగం 3.6 డ. మీ. వెడల్పు , పొడవు 18.82 కి.మీ. నుండి 3వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. ఇది 2021లోనే పూర్తయింది . రెండవ సొరంగం 7.5 డి.మీ. వెడల్పు, పొడవు 18.82 కి.మీ నుండి 8500 క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. 15 సంవత్సరాల క్రితం మొదలైన సొరంగం పనులు మొదటి సొరంగం పూర్తి చేసేందుకు 12 సంవత్సరాలు పట్టింది. రెండవ సొరంగం పనులను రికార్డు సమయంలో మెగా సంస్థ పూర్తి చేసినట్లు అధికారులు చెప్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, త్రాగునీరు

- Advertisement -

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు సాగు, త్రాగునీరు అందించడం ప్రాజెక్టు లక్ష్యం. ప్రకాశం జిల్లా లోని 3.5 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లా 80వేల ఎకరాలు, కడప జిల్లా 30వేల ఎకరాలు సాగు నీరు అందించే లక్ష్యం. 3జిల్లాలలోని 30మండలాలలోని 16లక్షల మందికి త్రాగునీరు అందించడం ప్రధాన లక్ష్యం. సహజ సిద్ధమైన రిజర్వాయర్‌ ఏర్పాటుకు కాకర్ల గ్యాప్‌, సుంకేసుల గ్యాప్‌ లు పూర్తయ్యాయి. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి వారిని తరలించడమే ప్రభుత్వం ముందున్న అసలైన పని.

Advertisement

తాజా వార్తలు

Advertisement